YCP LEADER LETTER TO DGP : రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వాడీవేడిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వు ఎంత అంటే నువ్వెంతని.. ప్రజలకు నువ్వు ఏం చేశావ్ అంటే నువ్వు ఏం చేశావ్ అని వివాదాలకు దిగుతున్నారు. అయితే అన్ని వివాదాలు జరుగుతున్న పోలీసులు మాత్రం అధికార పార్టీ చెప్పు చేతల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఎన్ని అన్యాయాలు జరిగిన బాధితులపైనే కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
తాజాగా పోలీసులపై మరో ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం లేనిదే పనులు జరగడం లేదని.. డబ్బు తీసుకోని పనులు చేయడం లేదని ఓ వ్యక్తి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖ రాసింది ప్రతిపక్షనాయకుడో, లేదా అతని అనుచరులో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ లేఖ రాసింది అధికార పార్టీకి చెందిన నాయకుడు. అవును మీరు విన్నది నిజమే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత.. మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ అధికారులను విమర్శిస్తూ లేఖ రాశారు.
సబ్ డివిజన్లో మూడు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయాలని డీజీపీకి ఉండవల్లి వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంజీవరెడ్డి లేఖ రాశారు. మంగళగిరిలో అవినీతి విలయ తాండవం చేస్తోందని లేఖలో తెలిపారు. నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్లు అవినీతి మయంగా మారాయని లేఖలో పేర్కొన్నారు.