STUDENTS DEAD IN ACCIDENT: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని చీకటిగల పాలెం సమీపంలోని గుంటూరు-కర్నూలు జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా.. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం మరొకరు మృతి చెందారు.
నూజెండ్ల మండలం జెడ్డవారిపాలెం గ్రామానికి చెందిన పారా గురు శ్రీను (17), పెమ్మసాని రామాంజనేయులు (19)లు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో గుంటూరు- కర్నూలు జాతీయ రహదారి చీకటిగల పాలెం వద్ద ఎదురుగా వస్తున్న జేసీబీ ఢీ కొనడంతో ఒక విద్యార్థి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. క్షతగాత్రుడిని 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. సెలవులకు ఇంటికి వచ్చిన వీరు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.