రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపికవుతున్న నలుగురిలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం లభించింది. జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణారావు, పారిశ్రామికవేత్త అయోధ్యరామిరెడ్డి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వైకాపా తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు.
జిల్లా నుంచి ఇద్దరికి రాజ్యసభలో సముచిత స్థానం కల్పించటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించకుంది. జిల్లాకు చెందిన సమస్యలు పార్లమెంటులో ప్రస్తావించి పరిష్కరించేందుకు వెసులుబాటు కలగనుంది. మోపిదేవి వెంకటరమణారావు తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత వైకాపాలో కొనసాగుతున్నారు. 1989, 1994లో కూచినపూడి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెదేపా అభ్యర్థి ఈవూరి సీతారావమ్మ చేతిలో ఓడిపోయారు. 1999, 2004లో కూచినపూడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందారు. 2009లో కూచినపూడి నియోజకవర్గం రద్దు కావటంతో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. అనంతరం వాన్‌పిక్ భూముల కేసులో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అరెస్టయి జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన అనంతరం వైకాపాలో చేరారు. 2014, 2019లో రేపల్లె నుంచి వైకాపా తరఫున పోటీ చేసి వరుసగా రెండుసార్లు తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో మోపిదేవిని వైఎస్ జగన్ నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీని చేశారు. మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో శాసనమండలి రద్దుకు వైకాపా తీర్మానం చేసింది. దీంతో మోపిదేవిని రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ నిర్ణయించింది. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయనకు రాజ్యసభ సీటు ఖరారు చేసింది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.