ఇసుక వ్యాపారంలోకి తిరిగొచ్చిన టర్న్‌కీ సంస్థ Turnkey again as a subcontractor: ప్రభుత్వ పెద్దలతో పొత్తు కుదరక ఇసుక వ్యాపారం నుంచి తట్టా బుట్ట సర్దేసిన టర్న్‌కీ... మళ్లీ వచ్చేసింది. ఇంతకీ టర్న్‌కీ ఎందుకు వెళ్లిపోయింది, ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చిందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే... గుత్తేదారులు, ఉపగుత్తేదారులతో సంబంధం లేకుండా... వైకాపా నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగిపోతోంది.
ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్: రాష్ట్రంలో ఇసుక వ్యాపారాన్ని ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్ సంస్థ 2021లో దక్కించుకుంది. అప్పుడే పుట్టుకొచ్చిన చెన్నైకి చెందిన టర్న్‌కీ ఉపగుత్తేదారుగా ప్రవేశించింది. 2021 మే నుంచి టర్న్‌కీ ఆధ్వర్యంలోనే వ్యాపారం సాగింది. ఇందులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబరు రెండో వారంలో టర్న్‌కీ అనూహ్యంగా ఉపగుత్తేదారు స్థానం నుంచి వైదొలిగింది. టర్న్‌కీని తప్పిస్తున్నట్లు అప్పట్లో ఓ కీలక మంత్రి, మరికొందరు పెద్దలు ప్రకటించారు. ఒకట్రెండు వారాల గడువిస్తే తవ్వకాల లెక్కలు చూసుకుని వెళ్లిపోతామని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా.. ఆ సంస్థను ఉన్నపళంగా వెళ్లగొట్టారనే ప్రచారం జరిగింది.
గుత్తేదారుగా టర్న్‌కీ:ఈ పరిస్థితుల్లో ఉపగుత్తేదారుగా వైదొలుగుతున్నట్లు ప్రధాన గుత్తేదారు జేపీ సంస్థకు టర్న్‌కీ తెలియజేసింది. మరో ఉపగుత్తేదారును నియమించే వరకూ రాష్ట్రంలో ఇసుక వ్యాపారం జరగకుండా చూడాలని గనులశాఖ సంచాలకులకు జేపీ సంస్థ లేఖలు రాసింది. అయినప్పటికీ జేపీతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉపగుత్తేదారులు పుట్టుకొచ్చారు. తొలుత బ్రాక్స్‌టన్ ఇన్‌ఫ్రాను తెరపైకి తెచ్చారు. ఆ సంస్థ పేరిట కొన్ని జిల్లాల్లో వేబిల్లులనూ ఇచ్చారు. వారంలోనే ఆ స్థానంలో కేకేఆర్ ఇన్‌ఫ్రా అనే మరో ఉపగుత్తేదారు సంస్థ వచ్చింది. ఇటీవలి వరకు ఆసంస్థ పేరిటే వేబిల్లులు ఇచ్చారు. తర్వాతి పరిణామాల్లో మళ్లీ టర్న్‌కీనే ఉపగుత్తేదారుగా తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా వేబిల్లులపై ఉపగుత్తేదారుగా టర్న్‌కీ పేరే ఉంటోంది.
ప్రేక్షక పాత్రకే పరిమితమైన టర్న్‌కీ:టర్న్‌కీ సంస్థ గతంలో ఎందుకు వైదొలగింది, మళ్లీ ఎలా వచ్చిందనేది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ ఏడాది సెప్టెంబరులో టర్న్‌కీని పంపేశాక ప్రతి జిల్లాలో అధికార పార్టీ నేతలు వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారు. ఒక్కో ఉమ్మడి జిల్లాలో ఒక్కో నేత మరికొందరిని భాగస్వాములను చేసుకున్నారు. టర్న్‌కీ మళ్లీ ఉపగుత్తేదారుగా వచ్చినప్పటికీ ప్రేక్షక పాత్రకే పరిమితమైనట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పలు జిల్లాల్లోని ఇసుక రేవుల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి.
ఇవీ చదవండి: