Turmeric Farmers State Conference: రాష్ట్రంలో పసుపు పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదని పసుపు రైతుల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఏడాది వర్షాలతో దిగుబడి కూడా తగ్గిందని, గతేడాది క్వింటా 6 వేల 800 రూపాయలు పలికిన పసుపు ధర.. ఇపుడు 4 వేల 800 రూపాయలకు పడిపోయిందని రైతులు వాపోయారు. వానలకు పసుపు తడవడంతో మరో వెయ్యి రూపాయల కోత వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2021లో రాష్ట్ర ప్రభుత్వం 6 వేల 850 రూపాయల మద్దతు ధర ప్రకటించడంతో రైతులు ఉత్సాహంగా పసుపు పంట వేశారు. విశాఖలో 5 వేల 771, గుంటూరులో 4 వేల 901, కడపలో 4 వేల 96, కర్నూలులో 15 వందల 10 హెక్టార్లలో పసుపు వేశారు. రెండేళ్లుగా పసుపు ఉత్పాదక ఖర్చులు, కౌలు భారీగా పెరగడంతో ఎకరాకు లక్షా 50 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది. ఈ మేరకు మార్కెట్లో పసుపు ధర మాత్రం పడిపోవడంతో చివరకు నష్టాలే మిగులుతున్నాయన్న రైతులు.. 10 వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.