ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నకిలీ చెక్కుల వ్యవహారంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఫిర్యాదు చేసిన రెవెన్యూ అధికారులను తుళ్లూరు పోలీసులు సోమవారం వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతోనూ తుళ్లూరు డీఎస్పీ భేటీ అయ్యారు. సచివాలయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ అధికారులనూ పోలీసులు ప్రశ్నించారు. గతంలో సీఎంఆర్ఎఫ్ కోసం జారీ చేసిన చెక్కులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు, కోల్కతా, దిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల నుంచి నకిలీ చెక్కుల ప్రతుల్ని పోలీసులు తీసుకున్నారు.
మరోవైపు తుళ్లూరు పోలీసుల విచారణ అనంతరం ఈ కేసును సీఐడీకి ప్రభుత్వం బదిలీ చేయనున్నట్లు సమాచారం. మూడు రాష్ట్రాల పరిధిలోని అంశం కావటంతో కేసును సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల పాత్రపైనా సీఐడీ అంతర్గత విచారణ చేపట్టనుంది.