TSPSC extended Group-4 Applications Date: తెలంగాణలో వెలువడిన ఉద్యోగాల దరఖాస్తులకు భారీ స్పందన వస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. నేటితో గడువు ముగియడంతో ఇప్పటివరకు మొత్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్యను అధికారులు వెల్లడించారు. 8,180 పోస్టులకు 8,47,277 మంది అప్లై చేసుకున్నట్టు తెలిపారు. నిన్న ఒక్కరోజే 58,845 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆఖరి రోజైన సోమవారం కొత్తగా మరో 34,247 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు.
మరోవైపు, దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు భారీ స్పందన వస్తుండటంతో సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగి దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని 25 విభాగాల్లో 8,180 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. సర్వర్లు మొరాయించడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా గ్రూప్ 4, వ్యవసాయ అధికారి దరఖాస్తుల గడువును టీఎస్‌పీఎస్‌సీ పొడిగించింది.
అదనంగా చేరిన బీసీ గురుకుల సొసైటీ పోస్టులు: గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో మరో 141 పోస్టులను అదనంగా టీఎస్‌పీఎస్సీ చేర్చింది. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో గ్రూప్-4 సర్వీసుల పరిధిలోకి వచ్చే 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రభుత్వం శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. దీంతో బీసీ గురుకుల సొసైటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు పంపించింది. ఈ మేరకు గ్రూప్-4 ఉద్యోగ ప్రకటనలో ఇపుడున్న 8039 పోస్టులకు అదనంగా 141 ఉద్యోగాలు చేర్చుతూ టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటన 19/2022కు అనుబంధాన్ని జారీ చేసింది.