KTR in munugode bypoll campaign: గులాబీ జెండాలు.. జై తెలంగాణ నినాదాలు.. డీజే పాటలు.. బోనాలతో స్వాగతాలు... ఇదంతా మునుగోడు నియోజకవర్గంలో తెరాస ప్రచార జోరు. ఉపఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలంటూ.. పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. పల్లెపల్లెలో తిరుగుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే.. తెరాస గెలవాలంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు.
పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ రోడ్‌షోలు చేస్తూ.. గులాబీ శ్రేణుల్లో జోష్‌ను నింపుతున్నారు. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలంటూ మంత్రి కేటీఆర్ గట్టుప్పల్‌లో పర్యటించారు. నియోజకవర్గ ఓటర్లను కలుసుకున్న మంత్రి మునుగోడు అభివృద్ధి కోసం గులాబీ పార్టీని గెలిపించాలని కోరారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ పార్టీ మారారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో గెలిచిన రోజు నుంచే రాజగోపాల్ భాజపాతో సంప్రదింపులు జరిపారని అన్నారు.
మునుగోడు ఎన్నిక కార్పొరేట్ కమలానికి.. గరిబోళ్ల గులాబీకి మధ్య జరుగుతున్న పోరు అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పేదల ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. దళితబంధు తరహాలో భవిష్యత్‌లో అన్నివర్గాల వారికి సర్కారు సాయం అందిస్తామని మంత్రి చెప్పారు.