Traffic Problems at Railway Level Crossings: రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద వంతెన నిర్మించాలంటే రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం నిధులు భరిస్తాయి. రైల్వేలైన్ పైన వంతెన భాగాన్ని రైల్వే శాఖే నిర్మిస్తుంది. దానికి రెండువైపులా అప్రోచ్లను ఆ రోడ్డును బట్టి ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పురపాలకశాఖలు నిర్మిస్తుంటాయి. రాష్ట్రంలో దాదాపు 90 వరకు ఆర్వోబీలను నిర్మించాల్సి ఉందని.. రైల్వేశాఖ గుర్తించింది. వీటిలో 48 వంతెనల నిర్మాణానికి మూడు దఫాలుగా రాష్ట్రానికి ప్రతిపాదనలు పంపించింది. వాటా నిధులిచ్చేందుకు జగన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటంతో చాలావరకు పనులు మొదలుకాలేదు. కొన్నిచోట్ల రైల్వేభాగం వరకే వంతెనలను నిర్మించి వదిలేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో గూడూరులోని రైల్వేలైన్ వంతెన పూర్తి చేసి వాహనదారుల కష్టాలు తీరుస్తామని 2018 డిసెంబరు 20న గూడూరులో నిర్వహించిన పాదయాత్ర సభలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. ఆయన సీఎం అయి ఇప్పటికి 53 నెలలు గడిచాయి. ఇప్పటికీ గూడూరు రైల్వే వంతెన ఒక్కడుగు కూడా ముందుకు కదల్లేదు. నిత్యం 130 వరకు వివిధ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సీఎం జగన్ తన హామీని గాలికొదిలేయడంతో రైల్వేగేటు పడినప్పుడుల్లా అరగంటకు పైగానే నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలు సమీపిస్తున్న తరుణంలో ఆర్వోబీ పనులను పూర్తి చేసేస్తామంటూ ఎమ్మెల్యే వరప్రసాదరావు గత ఆరు నెలల్లో రెండుసార్లు శంకుస్థాపనలు చేశారు. నేటికీ పనులు అతీగతీ లేదు.
శంకుస్థాపనకే పరిమితమైన ఆర్వోబీ... నరకం చూస్తున్న ప్రజలు
ఇది.. సీఎం జగన్ సొంత జిల్లాలోని కమలాపురం రైల్వేగేటు వద్ద పరిస్థితి. ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువ. గేట్ పడిన ప్రతిసారీ కనీసం 15 నిమిషాలు వాహనదారులు నిరీక్షించక తప్పడం లేదు. ఇక్కడి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్వయాన జగన్ మేనమామ. ప్రతిసారీ ఎన్నికలకు ముందు ఆర్వోబీ నిర్మాణంపై ఆయన హామీ ఇస్తూనే ఉన్నారు. రెండేళ్ల కిందట కమలాపురం నగర పంచాయతీ ఎన్నికల సమయంలో.. ఈ ఆర్వోబీ పూర్తి చేశాకే.. సాధారణ ఎన్నికల్లో మీ ముందుకొస్తానంటూ హామీ ఇచ్చారు. నేటికీ నెరవేర్చలేదు. తన వాటా సొమ్ము ఇవ్వలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేయడంతో దానిని నిర్మించేందుకు కేంద్రమే ముందుకొచ్చింది. గతేడాది డిసెంబరు 23న సీఎం జగన్ శంకుస్థాపన చేసినా.. ఇప్పటికీ పనులు మొదలుకాలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.