గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివపురంలో గిరిజన మహిళ రమావత్ మంత్రూభాయి హత్యకేసు నిందితుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలోని తన సోదరుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.
మంత్రూభాయి భర్త మంత్రూనాయక్ శ్రీనివాసరెడ్డి వద్ద రెండేళ్ల క్రితం 3.80 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. గత 20 రోజులుగా అప్పు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి ఒత్తిడి చేయసాగాడు. అయితే తమ వద్ద డబ్బు లేదని.. తాకట్టు పెట్టిన పొలం తీసుకుని అప్పు జమవేసుకోగా.. మిగిలిన సొమ్ము తమకివ్వాలని మంత్రూనాయక్ కోరాడు. అయితే శ్రీనివాసరెడ్డి తీసుకున్న అప్పుకు, పొలానికి లెక్క సరిపోయిందని చెప్పాడు. ఈ విషయమై శ్రీనివాసరెడ్డి మంత్రూనాయక్ వద్దకు ట్రాక్టర్ మీద వచ్చి పొలం తన పేరు మీద రాయాలని ఒత్తిడి చేశాడు. దీనికి నాయక్ అంగీకరించకపోవటంతో 'పొలం నాదే ఎవరు అడ్డొస్తారో చూస్తా'నంటూ శ్రీనివాసరెడ్డి బెదిరించారు. అంతేకాక ముందున్న మంత్రూభాయి మీదకు ట్రాక్టర్ పోనిచ్చాడు. తీవ్రగాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.