Road Accidents several Dead: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని వట్టిచెరుకూరు సమీపంలో ఓ ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు మరణించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ.. మరో మహిళ గరికపూడి సలోమి మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. బాధితులు ప్రత్తిపాడు మండలం కొండెపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన వారిలో నాగమ్మ, మేరమ్మ, రత్నకుమారి, నిర్మల, సుహాసిని, ఝాన్సీరాణి, సలోమీ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో కొండెపాడు, జూపూడిలో విషాదచాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
"నా పేరు కార్తీక. మా అమ్మ, అమ్మమ్మతో పాటు నేను కొండెపాడు నుంచి జూపూడికి శుభకార్యానికి వెళ్తున్నాము. మాతోపాటు మరికొంతమంది శుభకార్యానికి వెళ్లేందుకు ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడి యాక్సిడెంట్ అయ్యింది." - కార్తీక, ప్రయాణికురాలు
విజయనగంలో రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
మరోవైపు.. విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మరణించాడు. ఆధార్ అప్డేట్ చేయించుకునేందుకు అతడు తన చెల్లెలితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయనగరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని డెంకాడ మండలం బొడ్డవలస పంచాయతీ గెద్దవానిపాలేనికి చెందిన కోరాడ ప్రేమ్ కుమార్‌గా గుర్తించారు. విజయనగరంలోని జిల్లా కోర్టుకు, డీ మార్టుకు మధ్య ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అస్తవ్యస్తంగా పడి ఉన్న కేబుల్ వైర్లే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విజయనగరం వైపు వెళ్తుండగా.. కేబుల్ వైర్లు తగిలి బైక్ స్కిడ్ అయింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రంలో అతడి తల చిక్కుకుంది. దీంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో మృతుడి సోదరికి స్వల్పగాయాలవ్వటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
కడపలో గ్యాస్ లీక్.. మహిళ సజీవదహనం..
కడపలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమయ్యింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన గంగులమ్మ అనే మహిళ వంట చేసేందుకు సోమవారం ఉదయం గ్యాస్ స్టవ్ వెలిగించింది. అయితే ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఆమె బయటికి రాలేక మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమైపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చుట్టు పక్కలవారు చూసి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇల్లు మొత్తం దట్టమైన పొగతో కమ్ముకోవడంతో పాటు ఇంట్లో సామాగ్రి అంతా కాలిపోయింది. కడప ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సత్యసాయి జిల్లాలో లారీని ఢీకొన్న బొలెరో.. ఒకరు మృతి..
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం సంజీవపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి చెన్నై వైపు వెళ్తున్న బొలెరో వాహనం సంజీవపల్లి వద్ద లారీని అధిగమించే క్రమంలో వేగాన్ని నియంత్రించుకోలేక లారీని ఢీకొంది. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అతడు కదిరి ప్రాంతీయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: