Tourism Department in Andhra: రాష్ట్రంలో పర్యటకానికి వనరులు పుష్టి. కానీ, వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధికి నిధులు నష్టి. గతంలో ప్రారంభించిన వాటినీ జగన్ సర్కార్ పట్టించుకోక పోవడంతో పర్యాట రంగం రాష్ట్రంలో పడకేసింది. ఆదాయం తెచ్చిపెట్టే రంగంపై ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోంది. హోటళ్లు, రిసార్టుల ఆధునీకరణను గాలికి వదిలేయడంతో వసతుల లేమి వేధిస్తోంది. పర్యటకానికి రాష్ట్రం చిరునామా కావాలన్న జగన్, పర్యాటకులు మరోసారి రావాలంటేనే చీదరించుకునేలా మార్చేస్తున్నారు.
పర్యటకానికి రాష్ట్రం చిరునామాగా మారాలి. విదేశీయులనూ ఆకర్షించేలా అత్యాధునిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలంటూ, 2021 అక్టోబరు 27న రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం జగన్ ఘనంగా చెప్పారు. వేల కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం, దట్టమైన అడవులు, ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కలిసొచ్చే అంశాలు.
పర్యాటకానికి ఏపీ చిరునామా కావాలన్న జగన్ - అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వరే!
పర్యాటక రంగానికి కలిసి వచ్చే అంశాలను సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, జగన్ రివర్స్ పాలనలో కొత్తగా వచ్చే వారి సంగతి దేవుడెరుగు. ఒకసారి వచ్చిన వారు రెండోసారి వచ్చేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న హోటళ్లు, రిసార్టులు అధ్వానంగా మారాయి. కొన్నయితే శిథిలావస్థకు చేరుకున్నాయి. 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే వాటిని ఆధునికీకరించే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి అవేమీ పట్టడం లేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు రానున్నాయని జగన్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. పర్యాటకాభివృద్ధి సంస్థకి అత్యంత ముఖ్యమైన 16 హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణకు 50 కోట్లతో మూడేళ్ల క్రితం తయారు చేసిన ప్రతిపాదనలు పూర్తిగా పట్టాలెక్కలేదు.
Tenders for Modernization of Harita Hotel in Visakha: వైజాగ్‌లోని ఆ హోటల్‌పైనే ఎందుకంత ప్రేమ.. హడావుడిగా టెండర్లు
పెద్దఎత్తున విమర్శలు రావడంతో నెల్లూరు, ద్వారకా తిరుమల, అరకు తదితర ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టుల ఆధునికీకరణకు ఇటీవల టెండర్లు పిలిచారు. విశాఖలోని అప్పుఘర్‌లో అనేక దశాబ్దాల క్రితం నాటి హరిత హోటల్ అభివృద్ధి పనులను ఇటీవలే ప్రారంభించారు. వీటికి అవసరమైన నిధులను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ నుంచే ఖర్చు చేయనున్నారు.
పర్యాటకాభివృద్ధి సంస్థకు ఏటా కోటికి పైగా ఆదాయం వచ్చే విశాఖ రుషికొండపై ఉన్న హరిత హోటల్, రిసార్టులను నేలమట్టం చేసి, దాదాపు 400 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి జగన్ నివాసం కోసమని రాజభవనం నిర్మించారు. అందులో సగం నిధులను రాష్ట్రంలోని హోటళ్లు, రిసార్టుల అభివృద్ధికి, అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు కేటాయించి ఉంటే, ఏపీటీడీసీకి కూడా భారీగా ఆదాయం సమకూరేది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన నూతన హోటళ్లు, రిసార్టుల నిర్మాణ పనులకూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులివ్వని కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి.
YCP Govt Doesnot Care about Tourist Places: 'పర్యాటకం'పై వైసీపీ ప్రభుత్వం గొప్పలు.. కనీస సౌకర్యాల్లేక సందర్శకుల తిప్పలు
రాష్ట్రంలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో అరకు ఒకటి. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చే వారి కోసం టైడా వద్ద గతంలో ఇగ్లూ కాటేజీలు ఏర్పాటు చేశారు. కలపతో నిర్మించిన వీటిలో ఉండేందుకు సందర్శకులు ఎంతో ఇష్టపడేవారు. వీటిలో రెండు పూర్తిగా దెబ్బతినగా మరో 14 మరమ్మతులకు గురయ్యాయి. వాటిని బాగు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినా, నిధుల కొరతతో పనులు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.
విజయవాడలోని భవానీ ద్వీపం అభివృద్ధిని జగన్ సర్కారు పూర్తిగా వదిలేసింది. రోజూ 500కి పైగా, వారాంతాల్లో వెయ్యి మంది వరకు ఇక్కడికి వెళ్తుంటారు. ఇందులో 11 కాటేజీలు పూర్తిగా దెబ్బతిని వినియోగంలో లేవు. ఇతర సదుపాయాల కల్పనలోనూ గత అయిదేళ్లలో ఏమాత్రం చొరవ చూపలేదు. 10 కోట్ల రూపాయలతో కృష్ణా ఒడ్డున గతంలో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్ వరదలకు దెబ్బతిన్నా మరమ్మతులకు దిక్కులేదు.
AP Tourism: పర్యాటక రంగం అభివృద్ధి కోసం.. ఇన్వెస్టర్ల సదస్సు: మంత్రి అవంతి
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని దిండి పరిశాపాలెం బీచ్ అభివృద్ధికి గత ప్రభుత్వం హయాంలో ప్రణాళికలు తయారు చేశారు. పర్యాటకుల కోసం కోటితో రిసార్టు పనులు ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రిసార్టు పనులను పూర్చి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం హయాంలో చేపట్టిన పనులను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టింది. 2.40 కోట్ల రూపాయలతో కాటేజీలు, క్యాంటీన్, వ్యూ పాయింట్, ఈత కొలను, ఉద్యానవనం ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించేలోగా ఎన్నికలు రావడంతో సాధ్యం కాలేదు. తిరుపతిలో అలిపిరి వద్ద రుయా ఆసుపత్రి ఎదురుగా ఎకరా స్థలంలో రూ.17 కోట్ల అంచనాలతో హోటల్ ఏర్పాటుకు ఉద్దేశించిన భవన సముదాయం పనులు ఎనిమిదేళ్లయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది.
Tourist Places in Hyderabad : సరికొత్తగా ముస్తాబైన హైదరాబాద్.. వీటిని చూడటం అస్సలు మిస్సవ్వద్దు