ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమరాంధ్ర 2019... ఆంధ్రా ప్యారిస్​ ఎవరి అడ్డా? - allapati tdp

ఆంధ్రా ప్యారిస్​గా పేరొందిన తెనాలిలో ఎన్నికల పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. తెదేపా, వైకాపా బలంగా ఉన్నా జనసేనతో రాకతో ముక్కోణపు పోరు తప్పలేదు. అభివృద్ధే ఆయుధంగా తెదేపా ముందుకెళుతుండగా.. సానుభూతి కలిసొస్తుందని వైకాపా.. మార్పు కోసం తమనే గెలిపిస్తారని జనసేన ధీమాగా ఉన్నాయి.

ఆంధ్రా ప్యారిస్​ ఎవరి అడ్డా..?

By

Published : Apr 2, 2019, 11:36 PM IST

ఆంధ్రా ప్యారిస్​ ఎవరి అడ్డా..?
గుంటూరు జిల్లా తెనాలి... రాజకీయ చైతన్యం ఎక్కుగా ఉన్న నియోజకవర్గం. జిల్లా కేంద్రం గుంటూరు తర్వాత పెద్ద పట్టణం. ప్రస్తుతం తెదేపా తరఫున ఆలపాటి రాజేంద్ర మళ్లీ బరిలో దిగగా... వైకాపా నుంచి అన్నాబత్తుని శివకుమార్, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ పడుతున్నారు. ముగ్గురు మధ్యా ముక్కోణపు పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆలపాటి వేమూరు నుంచి 2సార్లు గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో తెనాలిలో పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2014లో గెలిచారు. ఐదేళ్లుగా నియోజకవర్గం అభివృద్ధికి విస్తృతంగా కృషి చేశారు. స్థానికంగా ఉండటం, ప్రజలతో మమేకమవడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఎన్నికల ప్రచారంలోనూ ప్రత్యర్థుల కంటే ముందున్నారు.

వైకాపా తరఫున బరిలో ఉన్న అన్నాబత్తుని శివకుమార్‌... కిందటి ఎన్నికల్లో ఓడిపోయారు. రెండోసారి అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇప్పటికే పాదయాత్ర, గడప గడపకు వైకాపా పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఈయన దూకుడు స్వభావం పార్టీ శ్రేణులకే నచ్చడం లేదన్న అపవాదు ఉంది. శివకుమార్ మాత్రం విజయంపై గట్టి ధీమాతో ఉన్నారు. గెలిస్తే తెనాలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు.

ఇక్కడ జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ బరిలోకి దిగారు. తెదేపా- వైకాపా అభ్యర్థులతో సమానమైన ఇమేజ్ ఉంది. స్పీకర్​గా చేయడంతో రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచే రెండుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ ఈయన మాత్రం గణనీయమైన ఓట్లే సాధించారు. ఇది ఆయనకు కాస్త సానుకూలాంశం అవుతుందని పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి, జనసేన ఎన్నికల ప్రణాళిక, ప్రజల్లో అధినేతకు తనకూ ఉన్న పేరు కలిసొస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు.

తెనాలి నియోజకవర్గంలో మొత్తం 2లక్షల 35వేల మంది ఓటర్లున్నారు. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం కావటంతో..గెలుపుకోసం ముగ్గురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోరులో ఉన్న 3 పార్టీల అభ్యర్థులూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావటం పోరును మరింత రసవత్తరంగా మార్చేసింది.

ABOUT THE AUTHOR

...view details