రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు 44 కేసులే ఉన్నా...తాజా కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది. దిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారి సన్నిహితుల వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగినవారు వీరిలో ఉన్నారు. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధరణ అయింది.
జిల్లా కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు 20 కడప 15 కృష్ణా 15 ప్రకాశం 15 పశ్చిమగోదావరి 14 విశాఖపట్నం 11 తూర్పుగోదావరి 9 చిత్తూరు 6 నెల్లూరు 3 అనంతపురం 2 కర్నూలు 1 మొత్తం 111
1313 మందికి పరీక్షలు
రాష్ట్రంలో మంగళవారం రాత్రి 9 నుంచి బుధవారం రాత్రి 10 వరకు 67 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం 1313 మందికి పరీక్షలు నిర్వహించగా, 111 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దిల్లీ నుంచి వచ్చిన వారిలో 543 మందికి, వారి సన్నిహితులు 269 మందికి పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన 218 మందికి, వారి సన్నిహితులు 140 మందికి పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలున్న మరో 143 మంది నమూనాలు సేకరించి పరీక్షలు చేశారు. దిల్లీ నుంచి వచ్చిన వారిని, వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి వైద్య సహాయం అందించడంపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.