HERO RAJENDRA PRASAD COMMENTS ON NTR : నందమూరి తారక రామారావు పేరుతో అవార్డు తీసుకోవడం జన్మలో మర్చిపోలేని జ్ఞాపకం అని నటకిరిటీ, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఎన్‌వీఆర్ కన్వెన్షన్ హాలులో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎన్టీఆర్‌కే సాధ్యమన్నారు. ఆయనతో తనకున్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని రాజేంద్రప్రసాద్ గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ తనతో మాట్లాడిన తర్వాతే కామెడీ హీరో అవ్వాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. రావణాసురుడిని హీరోగా చూపటం ఒక ఎన్టీఆర్‌కే సాధ్యమన్నారు. గురువు, దైవం ఎన్టీఆర్ అని.. ఎన్ని జన్మలెత్తినా నటుడిగాను ఎన్టీఆర్తోనే కలిసుండాలని కోరుకుంటునన్నారు. ఆస్కార్ అవార్డు పొంది.. తెలుగు వాడి గౌరవాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్కి ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపారు. సంవత్సరం పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరగటం గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ వివక్షతోనే నందమూరి తారక రామారావుకు భారతరత్న రాలేదని.. ఇప్పటికైనా ఆయనకు ఇవ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలిలోని ఎన్‌వీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార ప్రదాన సభలో ఆయన ప్రసంగించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. సభకు అధ్యక్షత వహించారు. అన్న తెచ్చిన పలు చట్టాలను కేంద్ర ప్రభుత్వాలు కూడా అమలు చేశాయని శోభనాద్రీశ్వరరావు గుర్తు చేశారు.