Today Weather Report Of AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. వాయువ్య భారత్ నుంచి ఉష్ణగాలులు వీస్తుండటంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణ, కర్ణాటకల నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. బంగాళాఖాతం నుంచి ఈశాన్య భారత్ వరకూ బలంగా నైరుతీ గాలుల ప్రభావం ఉన్నట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. మరోవైపు అండమాన్ సముద్ర తీరప్రాంతాల్లో నైరుతీ రుతుపవనాలు ముందుకు కదులుతున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. రాగల మూడు రోజుల్లోగా అండమాన్ నికోబార్ దీవులపై నైరుతీ రుతుపవనాలు విస్తరించే సూచనలు ఉన్నట్టు తెలిపింది.
Rain Forecast: మరోవైపు రాగల నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం తదితర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఉష్ణగాలుల ప్రభావంతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది.
District Wise Temperatures in AP: ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 45.68 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా రాచర్లలో 45.67 డిగ్రీలు నమోదైంది. మంత్రాలయంలో 43.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 43.04 డిగ్రీలు, తిరుపతి జిల్లా తొట్టంబేడులో 42.67 డిగ్రీల మేర రికార్డు అయ్యింది. నంద్యాల చాగలమర్రిలో 42.67, యర్రగొండపాలెంలో 42.6 డిగ్రీలు కడప జిల్లా కొండాపురంలో 42.5, బాపట్లలో 42.3 డిగ్రీలు, చిత్తూరు 41.82, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 41.8 డిగ్రీలు నమోదైంది. తూర్పుగోదావరి గోపాలపురంలో 41.4, కృష్ణా జిల్లా తోట్లవల్లూరు 41.33 కాకినాడ 41.2, విజయనగరం పూసపాటి రేగ 40.8, విజయవాడ 40.87, గుంటూరు మంగళగిరి 40.55 ఏలూరు 40.5, అనంతపురం గుత్తి 40.4 డిగ్రీల మేర రికార్డు అయింది.
Precautions to be taken in summer: ఎండలు అధికంగా ఉన్న సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ సూచించారు. తరచూ దప్పికతో సంబంధం లేకుండా అవసరమైన నీటిని తాగాలని, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్, లస్సీ, పళ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో తాగునీటి బాటిళ్లను వెంట ఉంచుకోవాలన్నారు. సీజనల్ పండ్లను తినాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని తెలిపారు. మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని చెప్పారు.
ఇవీ చదవండి: