ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తాం' - చంద్రబాబు తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీలో ఎప్పటిలానే వెనుకబడిన వర్గాలకు అగ్ర ప్రాధాన్యమిస్తూ... యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని... వారి తరఫున తెదేపా పోరాడుతుందని భరోసా ఇచ్చారు. వర్చువల్‌గా రెండు రోజులు జరిగిన మహానాడులో 22 తీర్మానాలు ఆమోదించగా.... 55 మంది నాయకులు ప్రసంగించారు.

tdp mahanadu
tdp mahanadu

By

Published : May 28, 2020, 11:28 PM IST

వచ్చే నాలుగేళ్లలో పార్టీలో యువతకు బాధ్యతలిస్తూ, భవిష్యత్తు‌ నాయకత్వాన్ని తయారుచేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రకటించారు. మహిళలకు సముచిత గౌరవమిస్తామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోని 904 మండలాల్లో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు జరిగాయన్న చంద్రబాబు... అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయి, బహ్రెయిన్‌ తదితర దేశాల నుంచీ తెదేపా నాయకులు మహానాడులో పాల్గొన్నట్టు వివరించారు. కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గేంత వరకు పార్టీ శ్రేణులు సేవాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి, జే ట్యాక్స్‌ వసూళ్లు, పెరిగిన నిత్యావసరాల ధరలు, తదితర తీర్మానాలకు సంబంధించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

యువ నాయకత్వం రావాలి...
38 ఏళ్ల తెలుగుదేశ పార్టీ చరిత్రలో మరోతరం నాయకత్వం ఎదిగాల్సిన సమయం ఇదేనంటూ మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు బలపరిచారు. కొత్త తరం నాయకత్వం ఎదిగేందుకు ప్రతిపక్షంలో ఉండటం ఓ అవకాశమని యనమల అన్నారు. అధికారంలో ఉంటే ప్రజాసేవకే ప్రాధాన్యం ఉంటుందని... ప్రతిపక్షంలో పోరాటాలకు అవకాశం ఉంటుందని వివరించారు. యువతరానికి ఇది చక్కని అవకాశమన్నారు.
పాలనంతా అవినీతిమయం: లోకేశ్
జగన్‌ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జే ట్యాక్స్ వసూళ్ల పేరుతో మహానాడులో లోకేశ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.... ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి బలపరిచారు. ఒక్క మద్యం ద్వారానే కోట్లాది రూపాయల జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్, భూ, విద్యుత్‌ కొనుగోళ్లు అన్నీ అవినీతిమయమేనని ఆరోపించారు.

బీసీలపై ఉక్కుపాదం
పవిత్ర జలాలు, పవిత్ర మట్టితో పునీతం చేసిన అమరావతికి తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజా రాజధాని అమరావతి నిలుపుదల - మూడు ముక్కలాట పేరిట తెనాలి శ్రావణ్ కుమార్‌ తీర్మానం ప్రవేశపెట్టగా... దానిని శ్రీనివాసరెడ్డి బలపరిచారు. తెలుగుదేశం ఏర్పడిన తరువాతే రాష్ట్రంలో సంక్షేమం పుట్టిందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం అంటే బీసీలని, బీసీలంటే తెలుగుదేశమని ఆయన పేర్కొన్నారు.

మహానాడులో బలిపీఠంపై సంక్షేమం - పథకాల రద్దుపై అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా వంగలపూడి అనిత దానిని బలపరిచారు. బీసీలు ఆర్దికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందారంటే దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమేనని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ బీసీల మీద కక్షగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి ఉక్కుపాదం మోపుతున్నారని విమర్శించారు.
అన్ని ధరలు అధికం...
వైకాపా ఏడాది పాలనలో ప్రజలపై 50 వేల కోట్లు భారం మోపారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అధిక ధరలు, ప్రజలపై 50వేల కోట్ల భారం పేరిట మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా కోట్ల సుజాతమ్మ బలపరిచారు. విద్యుత్, మద్యం, ఇసుక, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయని వారు దుయ్యబట్టారు. తెలంగాణకు సంబంధించి తెరాస వాగ్దానాలు - వైఫల్యాలు తీర్మానాన్ని రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టగా మహానాడు ఏకగ్రీవంగా తీర్మానించింది. వీటితో పాటు దేశ భద్రతకు సంబంధించి భారత ప్రధాని తీసుకునే నిర్ణయాలకు తెలుగుదేశం పూర్తి సహకారం అందిస్తుందనే తీర్మానాన్ని మహానాడులో ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

మొత్తంగా వైకాపా ఏడాది పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపడమే ప్రధాన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మహానాడు తీర్మానాలపై చర్చ సాగింది.

ABOUT THE AUTHOR

...view details