పరీక్ష, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబ బాధ్యతలు.. ఇలా దేంట్లోనైనా విఫలం కావచ్చు. ఓడిపోయామనే అపరాధ భావంతో కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తీవ్రమైన నిరాశతో కుంగుబాటుకు గురవుతుంటారు.
కారణాలను అన్వేషించాలి :
విఫలమైన తర్వాత ‘ఇక నేనెందుకూ పనికిరాను’ అనే ఆలోచనకు వెంటనే వచ్చేయకూడదు. దాని వెనక ఉండే కారణాలనూ లోతుగా విశ్లేషించుకోవాలి. మళ్లీ అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు. కాబట్టి జరిగిన దాంట్లో మీ పొరపాట్లను గుర్తించి.. అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది.
చెడు అలవాట్లు :
ఓడిపోయామనే భావన వెంటాడుతుంటే దాన్నుంచి తప్పించుకోవడానికి.. కొంతమంది చెడు అలవాట్లకు చేరువవుతుంటారు. అతిగా నిద్రపోవడం, మితిమీరి తినడం, ఏ పనీ చేయకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం.. లాంటివి చేస్తుంటారు. ఇలాచేయడం వల్ల మరింత కుంగిపోయే అవకాశముంటుంది.
ప్రేరణ పొందాలి :
మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక అవగాహనకు రావడానికీ ఓటమి నుంచే ప్రేరణ పొందాలి. నిజానికి ఆపదలో ఉన్నప్పుడే అసలైన ఆప్తులెవరో మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో మీకు చేయూతను అందించేవాళ్లు చెప్పే మాటలను మనసుపెట్టి ఆలకించండి. ఓటమి నేర్పిన పాఠాలతో జీవితాన్ని మరింత అందంగా మలచుకోవచ్చు. ఆ దిశగా అడుగులు వేయడానికి మెల్లగా ప్రయత్నాలు మొదలుపెట్టండి.