ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్పొరేషన్లతో ప్రభుత్వం మాయాజాలం.. అప్పులు, వ్యయాల ప్రస్తావన లేకుండానే బడ్జెట్‌ లెక్కలు

CORPORATION DEBTS : రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పథకాల కోసం చేస్తున్న ఖర్చులు, ఆయా నిధులను ఏయే రూపాల్లో సమీకరిస్తున్నారన్న దానిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2023-24 వార్షిక బడ్జెట్‌ అంచనాలు, కాగ్‌ ధ్రువీకరించిన 2020-21 వాస్తవ లెక్కలు, 2022-23లో సవరించిన అంచనాలను సైతం పరిశీలిస్తే.. ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాలకు నిధులు సమీకరిస్తూ.. ఆ అప్పులను, ఖర్చులను కార్పొరేషన్ల వ్యయాలుగా చూపడం వల్లే రెవెన్యూ, ద్రవ్య లోటుల్లో అనేక వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

CORPORATION DEBTS
CORPORATION DEBTS

By

Published : Mar 17, 2023, 10:41 AM IST

కార్పొరేషన్లతో ప్రభుత్వం మాయాజాలం

CORPORATION DEBTS : రాష్ట్ర ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్‌లో అప్పులను మసిపూసి మారేడు కాయ చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25) చివరి నాటికి జీఎస్‌డీపీలో అప్పులు 35 శాతం కన్నా తక్కువ ఉండేలా చూపేందుకు తాపత్రయపడుతూ అందుకు అనుగుణంగానే అనేక లెక్కలు సర్దుబాటు చేసినట్లుగా కనిపిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలో 4లక్షల 83వేల 009 కోట్ల ప్రజా రుణం ఉంటుందని.. ఇది GSDPలో 33.32 శాతానికే పరిమితం చేసేశామని పేర్కొంది. లోతుగా పరిశీలిస్తే ఒకవైపు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాలు సమీకరిస్తూ వాటి ఖాతాల్లోనే ప్రభుత్వ ఖర్చులూ చూపిస్తున్న నేపథ్యంలో ఈ లెక్కల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతోంది.

కార్పొరేషన్ల రుణాలను ప్రభుత్వం సమగ్రంగా వెల్లడించడం లేదు. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల కోసం గ్యారంటీలు ఇచ్చినట్లు చెబుతున్నా.. ఈ మొత్తం ఇంకా ఎక్కువ ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కార్పొరేషన్ల రూపంలో 2022 డిసెంబరు నెలాఖరు నాటికి 1లక్షా 38వేల 874.75 కోట్ల అప్పు తీసుకున్నట్లు పేర్కొంటోంది. కాగ్‌, ఆర్థిక సంఘం కూడా.. కార్పొరేషన్ల రుణాలను కూడా కలిపి మొత్తం రుణాలను లెక్కించాలని పదేపదే చెబుతున్నాయి. వీటిని కూడా కలిపితే మొత్తం అప్పులు జీఎస్‌డీపీలో 42.90 శాతానికి పెరగనున్నాయి. పైగా కార్పొరేషన్ల రుణాలు తక్కువ చేసి చూపుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఆ మొత్తాలు మరింత పెరగనున్నాయి. నిజానికి మొత్తం కార్పొరేషన్ల రుణాలను పరిగణనలోకి తీసుకుంటే జీఎస్‌డీపీలో రుణాల శాతం ఇంకా ఎంతో పెరిగిపోతుంది.

2021-22లో సవరించిన లెక్కలకు, వాస్తవ లెక్కలకు మధ్య చాలా మార్పులొచ్చాయి. సాధారణంగా సవరించిన అంచనాలకు, ఖరారైన లెక్కలకు మధ్య కొన్ని తేడాలుంటాయి. ఒకవైపు ప్రభుత్వ రంగ కార్పొరేషన్లు కొత్తవి ఏర్పాటు చేసి, వాటి ద్వారా సమీకరిస్తున్న రుణాలను ప్రభుత్వం వివిధ రూపాల్లో రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తోంది. ఏపీఎస్‌ఐడీసీ ద్వారా రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు 23వేల 850 కోట్ల వరకు రుణాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా 8వేల 300 కోట్ల వరకు రుణాలు తీసుకువచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించారు. ఇవి కాకుండా ప్రతి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ కార్పొరేషన్లకు గ్యారంటీలిచ్చి కొత్త రుణాలు తీసుకుంటున్నారు. వాటన్నింటినీ ప్రభుత్వ పథకాలకు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు, బదిలీల రూపంలో ఏకంగా 14వేల 349.93 కోట్లు ఉన్న పళంగా తగ్గించి చూపారు. దీంతో మూలధన వసూళ్ల రూపంలో ఏకంగా 14వేల 680.95 కోట్ల మేర కోత చూపిస్తూ.. ఖర్చులోనూ ఆ మేరకు తగ్గించారు. ఈ ప్రభావంతో 2021-22 సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు 19వేల 545 కోట్లు ఉంటే ఖరారైన లెక్కల్లో అది 8వేల 160 కోట్ల లోటుకు పడిపోవడం విశేషం. ద్రవ్యలోటు సవరించిన అంచనాల్లో ఏకంగా 38వేల 224.02 కోట్లు ఉండగా వాస్తవ లెక్కలు తేలేసరికి అది 25వేల 011 కోట్లకు తగ్గిపోయింది. ఒక వైపు కార్పొరేషన్ల నుంచి పెద్ద మొత్తాల్లో రుణాలు తీసుకుని ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఉండగా, ఉద్యోగుల నుంచి సమీకరించిన మొత్తాలనూ తీసేసుకుంటోందన్న ఆందోళనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో డిపాజిట్లు, అడ్వాన్సుల పేరిట అంత మొత్తం ఎలా తగ్గించి చూపారనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రభుత్వ ఖర్చులను కార్పొరేషన్లలో చూపడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం గ్యారంటీలిచ్చి కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకుని అనేక పథకాలకు తిరిగి వాటి ద్వారానే ఖర్చు చేస్తోంది. తమ డబ్బులు సైతం ప్రభుత్వం పెద్ద మొత్తంలో వాడేసుకుంటోందని, ఖాతాల్లో సొమ్ములు మాయమవుతున్నాయని ఉద్యోగ సంఘాలు గోలలు చేస్తున్నాయి. మరోవైపు డిపాజిట్లు, ఇతర రిజర్వుల నుంచి వాడుకున్న సొమ్ములు తిరిగి చెల్లించేసినట్లు, చెల్లింపుల భారం తగ్గిపోయినట్లు ప్రభుత్వం చూపుతుండటం గమనార్హం. ఫలితంగా అప్పులు తక్కువ చేసి చూపేందుకు ఆస్కారం ఏర్పడుతోంది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే డిపాజిట్లు, బదలాయింపుల రూపంలో వినియోగించుకున్న నిధులు 14వేల 349 కోట్లు తగ్గించి చూపి.. ఆమేరకు అప్పులు తగ్గిపోయినట్లు లెక్కలేశారు. 2022-23లో 727 కోట్లు తగ్గించి చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల నుంచి దాదాపు 25 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని, వీటితోనే కొన్ని కార్పొరేషన్ల రుణాలు చెల్లించారని తెలుస్తోంది. ఆ రుణాలను ప్రభుత్వ ఖర్చులకే వినియోగించుకున్న నేపథ్యంలో ఇలా తగ్గించి చూపడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేల కోట్ల పెండింగు బిల్లులను వచ్చే ఆర్థిక సంవత్సరం లోపు ఎలా చెల్లిస్తారో ఎక్కడా ప్రస్తావించలేదు. గత నాలుగేళ్లుగా పెండింగ్‌ బిల్లులది ఇదే పరిస్థితి. ప్రభుత్వ సబ్సిడీల మొత్తాలు సరిగా చెల్లించకపోవడంతో నాన్‌ గ్యారంటీ రుణాల ప్రభావమూ ఎక్కువగా ఉంటోంది. ఆ లెక్కలేవీ ప్రభుత్వ భారాల్లోకి రావడం లేదు.



ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details