ఒక ఇంట్లో ఒకరు సర్పంచి కావడం సాధారణంగా చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఒకే ఇంట్లో ముగ్గురు సర్పంచులుగా చేయడం విశేషమే. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చినపాలెం పంచాయతీ దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. మండలంలోని చిన్న గ్రామాల్లో ఇదొకటి. 1,200 మంది జనాభా ఉంటారు. వారిలో 612 మంది ఓటర్లు. ఎన్నికల్లో చినపాలెం వాసులు ఆ కుటుంబం పట్ల పెద్దమనసు చూపారు. పెమ్మసాని చలపతిరావు 1998లో సర్పంచిగా ఎన్నికయ్యారు. 2009లో మహిళలకు కేటాయించడంతో చలపతిరావు భార్య పెమ్మసాని భారతీదేవి గెలుపొందారు.
గ్రామస్థుల అభిమానం.. ఆ ఇంట్లో ముగ్గురూ సర్పంచులే - గుంటూరు జిల్లా తాజా వార్తలు
ప్రజలకు ఒకసారి ఓ నాయకుడిపై అభిమానం కలిగితే.. అది ఎప్పటికీ కొనసాగుతుందనడానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చినపాలెం పంచాయతే ఉదాహరణ. 1998 నుంచి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని సర్పంచులుగా చేశారు. వాళ్లు కూడా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు.
వారి మరణానంతరం 2015లో వారి కుమారుడు పెమ్మసాని కృష్ణకిషోర్ ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచి అయ్యారు. తమ మాజీ సర్పంచి కుమారుడు సర్పంచి కావాలనే ఉద్దేశంతో ఎవరూ పోటీ చేయలేదు. ప్రజలు కృష్ణకిషోర్‌కు అంత గౌరవం ఇచ్చారు. ప్రస్తుతం పంచాయతీ కార్యాలయం ఉన్న స్థలం చలపతిరావు వితరణగా ఇచ్చిందే. కృష్ణకిషోర్ సర్పంచి అయ్యే ముందు వరకూ ఎక్కువగా పుట్టపర్తిలో సాయిబాబా వద్దే ఉండేవారు. గ్రామానికి సర్పంచి అయ్యాక అభివృద్ధిపై దృష్టి సారించారు. ఏకగ్రీవం అయినందుకు వచ్చిన రూ. 5 లక్షలతోపాటు పంచాయతీ నిధులు ఉపయోగించి మురుగుకాల్వల ఏర్పాటు, కొన్ని రోడ్లు వేశారు. కొంత కాలం తర్వాత ఆయన కూడా మృతి చెందారు.