నూతన గృహ ప్రవేశానికి బంధువులందరినీ పిలిచాడు. బంధువుల మధ్య అట్టహాసంగా కొత్త ఇంట్లోకి వెళ్లాడు. రోజంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలిన చుట్టాలు, ఇంట్లోవాళ్లు అలసి నిద్రపోయారు. పడుకునే ముందు బంగారు అభరణాలను బ్యాగులో పెట్టారు. ఆ బ్యాగును తలకింద ఉంచుకుని నిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రి ఇంట్లో దొంగలుపడి.. బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి అందరికీ షాక్ తగిలింది. బంగారు నగలు కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన ఆగస్టు 26 గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లూరులో..నంబూరి మధుసూధనరావు అనే వ్యాపారి నూతన గృహ ప్రవేశంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. హనుమాన్ పాలెం గ్రామం వద్ద మర్రి వెంకయ్య(అలియాస్ వెంకటేశ్వర్లు). అనే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోతుగా ప్రశ్నించగా దొంగతనానికి పాల్పడింది తానేనని వెంకయ్య ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.7,35,000 విలువ చేసే 32కాసుల బంగారు అభరణాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.