ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతుకు పోరాటం...నీటి ప్రవాహంలో సాహసం.. - canal

ఆ గ్రామ ప్రజలు పొట్ట నింపుకోవడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. జోరున సాగే నీటి ప్రవాహంలో ఓ తాడు సాయంతో గట్టు చేరుతున్నారు. దూరం 70 మీటర్లే ఉన్నా పట్టు తప్పితే మాత్రం ప్రాణం పోయే పరిస్థితి. ఆడవారైనా, మగవారైనా, ముసలివారైనా కూలి పనికి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే.

బతుకు తాడు

By

Published : Aug 31, 2019, 7:03 AM IST

అరచేతిలో ప్రాణాలు

గుంటూరు జిల్లా కాకుమాను మండలం చినకాకుమాను గ్రామం. వందకు పైగా నివాసాలు, 500 పైగా జనాభా ఉంటారు. కొమ్మూరు కాలువ ఈ గ్రామం పక్కనుంచే వెళ్తుంది. అయితే గ్రామానికి చెందిన పొలాలన్నీ కాలువకు అవతలి వైపున ఉన్నాయి. రైతులు, కూలీలు పొలాలకు వెళ్లాలంటే దీనిని దాటాల్సిందే. కానీ వంతెన లేకపోవటంతో ఆ గ్రామస్థులు అష్టకష్టాలు పడుతున్నారు. కాలువ ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకూ 30 మీటర్ల దూరం ఉంటుంది. అలాగే లోతు 3 మీటర్ల మేర ఉంటుంది. గట్టుకు అవతలివైపు చెట్టుకు.... ఇవతలి వైపు కరెంటు స్థంబానికి తాడు కట్టి దాని సాయంతో కాలవ దాటుతున్నారు గ్రామస్థులు.

నలుగురు మృతి
గత 15 ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలు తాడు ఆధారంగానే బతుకు సమరం సాగిస్తున్నారు. దానికి ముందు, అంటే 2000 సంవత్సరంలో (2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కాకుమాను మండలం పొన్నూరు నియోజకవర్గంలో ఉండేది) ఈ పరిస్థితిని గమనించిన అప్పటి పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సాగునీటి అధికారులతో మాట్లాడి ఓ బల్లకట్టు ఇప్పించారు. అది నాలుగు సంవత్సరాలు పనిచేసి తర్వాత పాడైంది. కొన్నాళ్లు రైతులు, గ్రామస్థులు చందాలు వేసుకొని బాగు చేయించుకునేవారు. ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ముళ్లకంపల్లోకి చేరింది. అప్పటినుంచి గ్రామస్థులకు తాడే ఆధారమైంది. ఇలా తాడుతో కాలువను దాటుతూ నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

హోంమంత్రి నియోజకవర్గం
ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత గెలిచారు. ఆమె రాష్ట్ర హోంశాఖతో పాటు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆమె సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఆమె స్పందించి కాలువపై వంతెన నిర్మించి తాడు బాధ నుంచి తమను తప్పిస్తారని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details