Police Situation in Andhra Pradesh: అక్టోబరు 20,2021లో..తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైఎస్సార్సీపీ నేతల దాడిపట్ల అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పందన అదే విధంగా డిసెంబర్ 28,2022న.. మాచర్లలో తెలుగుదేశం కార్యాలయం, పార్టీ నేతల ఇళ్లకు వైఎస్సార్సీపీ నాయకులు నిప్పుపెట్టడంపై ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందన చూస్తుంటే.. అధికార పార్టీ వాళ్లది ఏం తప్పులేదు అనే విధంగా ఉంది..
బాధితులపైనే రివర్స్ కేసులు: వీళ్లిద్దరి పోస్టులే కాదు.. పలుకుల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. దాడి చేసిన వారిది తప్పు కాదు.. ప్రేరేపించిన వారిదే తప్పు అనేది వీళ్లద్దరి మాటల్లో అర్థం పరమార్థం. అదేంటి ఐపీసీ సెక్షన్‌లో అలా ఉండదు కదా.. అంటారా? రాష్ట్రంలో అమలౌతోంది ఐపీసీ చట్టమైతే ఫర్వాలేదు.. కానీ ఇక్కడుంది వైసీపీ చట్టం. అది అధికార పార్టీకే చుట్టం.! అధికార పార్టీని ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు పౌరుషం పుట్టుకొస్తుంది. అంతెందుకు సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్ పెట్టినా చాలు.. నోటీసులంటూ వెంటాడుతారు. అదే ప్రతిపక్షపార్టీల వారిని.. అధికార పార్టీ నేతలు బండబూతులు తిట్టినా, కర్రలతో చావబాదినా.. మందలుమందలుగా వెళ్లి ఇళ్లు తగలబెట్టినా సరే కళ్లప్పగించి చూస్తారు. పైపెచ్చు బాధ్యులపై కాకుండా బాధితులపైనే రివర్స్ కేసులు బనాయిస్తారు.
ప్రైవేట్ సైన్యం: ఎస్సీ, ఎస్టీలను దూషించారనో, పోలీస్ విధుల్ని అడ్డుకున్నారనో.. కొత్తకొత్త సెక్షన్లు వెతికి మరీ సంకెళ్లు వేస్తారు. వీలైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు. అధికారపార్టీకి దాసోహమైన.. ఏపీ పోలీస్ వ్యవస్థ చట్టాన్ని వైసీపీ చుట్టంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటవిక రాజ్యాలతరహాలో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
ఒక్కొక్కరికీ ఒక్కో ట్రీట్‌మెంట్ : అధికార, విపక్షాలు గొడవపడితే ఒక్కొక్కరికీ ఒక్కో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు మన ఖాకీలు. ప్రతిపక్షపార్టీ వాళ్లపై బెయిల్‌కు వీల్లేని సెక్షన్లు పెట్టేస్తారు. అదే అధికార పార్టీ వాళ్లపై స్టేషన్ బెయిల్‌తో బయటకు పంపే సెక్షన్లతో.. సరిపెట్టేస్తారు. కళ్లెదుటే వైఎస్సార్సీపీ శ్రేణులు బరితెగించి దాడులు, విధ్వంసాలు, దహనాలకు తెగబడుతుంటే ఉక్కుపాదంతో అణచేయాల్సింది పోయి.. బాబ్బాబు అంటూ బతిమలాడుకుంటారు. గన్నవరంలో.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులే దీనికి తాజా నిదర్శనం.
అన్నా అన్నా అంటూ: రాము, ఓలుపల్లి రంగా సహా మరికొందరు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు పోలీసుల్ని నెట్టేసుకుంటూనే టీడీపీ కార్యాలయంపైకి వెళ్లారు. కర్రలతో కార్లు ధ్వంసం చేస్తుంటే, పెట్రోల్ పోసి తగలబెడుతుంటే.. అన్నా అన్నా’అంటూ బతిమాలాడేరేగానీ.. అణచివేయలేదు. అక్కడ విధ్వంసం జరిగింది టీడీపీ కార్యాలయంలో, చేసింది ఎమ్మెల్యే అనుచరులన్నది.. స్పష్టమైన వీడియోలున్నాయి. కానీ టీడీపీ నేతలపైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాడి చేసిన వైఎస్సార్సీపీ నాయకులపై మాత్రం ఒక కేసు పెట్టేసి.. మమ అనిపించారు.
గతేడాది డిసెంబరులో:గన్నవరమేకాదు.. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక జరిగిన అనేక ఘటనల్లోనూ పోలీసులు రివర్స్ కేసులు తప్ప.. రాజ్యాంగం ప్రకారం నడుచుకున్న సందర్భాలు లేవనేచెప్పాలి. గతేడాది డిసెంబరు 25న.. గుడివాడ టీడీపీ కార్యాలయంపైకి కత్తులు, కర్రలతో వెళ్లి పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన.. వైసీపీ నాయకుడు కాళిపై బెయిలబుల్ సెక్షన్ల పెట్టారు. వాళ్లదాడిని.. ప్రతిఘటించే ప్రయత్నం చేసిన రావిపై మాత్రం.. కఠిన సెక్షన్లు నమోదు చేశారు. ఎవరో విసిరిన కర్ర తగిలి.. ఓ హెడ్ కానిస్టేబుల్‌కు గాయమైతే.. దానికి టీడీపీ నాయకులే కారణమంటూ కేసు పెట్టారు.
కుప్పంలోనూ: గతేడాది ఆగస్టులో చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ ఇదే తంతు. వైసీపీ శ్రేణులు దాడి చేస్తే..65 మంది టీడీపీ కార్యకర్తలపై.. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెట్టారు. ముగ్గురు.. వైసీపీ నాయకులపై బెయిలబుల్ సెక్షన్లు పెట్టినా ఇంతవరకూ అరెస్టు ఊసేలేదు.