గుంటూరులో కోడెల కుమారునికి చెందిన గౌతం హీరో షోరూం తరపున రవాణాశాఖకు కోటి రూపాయల జరిమానా చెల్లించారు. ఆగస్టు నెల మొదటి వారంలో రవాణాశాఖ అధికారులు గౌతం షోరూంని తనిఖీ చేసి అక్రమాలు జరిగాయని వెల్లడించారు. ఈ ఏడాదిలోనే 576 వాహనాలు అక్రమంగా విక్రయించారని నివేదికలోపేర్కొన్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో 41లక్షల రూపాయలు రవాణాశాఖకు చెల్లించకుండా ఎగవేసినట్టు తెలిపారు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి నష్టం చేకూర్చారని... గౌతం హీరో షోరూంను అధికారులు సీజ్ చేశారు. కొత్త వాహనాలు విక్రయించకుండా, రిజిస్ట్రేషన్లు చేయకుండా బ్లాక్ చేశారు. తర్వాత రవాణాశాఖ కమిషనర్ కోటి రూపాయల జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని షోరూం యజమానులు ఇవాళ గుంటూరు రవాణాశాఖ అధికారులకు చెల్లించారు. ఇంత భారీ జరిమానా విధించటం రవాణాశాఖ చరిత్రలో తొలిసారని గుంటూరు ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ తెలిపారు. కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత షోరూంలో విక్రయాలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన మరో ఏడు షోరూంలకూ 39లక్షల రూపాయల మేర జరిమానా విధించినట్లు ఆయన వెల్లడించారు. ఇకపైనా షోరూంలపై నిరంతరం తనిఖీ చేస్తామని... నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీరాప్రసాద్ హెచ్ఛరించారు.
గౌతమ్ హీరో షోరూం చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా? - మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం
రవాణా శాఖ విధించిన జరిమానాను కోడెల శివరాం చెల్లించారు. తను నిర్వహించే గౌతం షోరూమ్‌ల్లో అక్రమాలు జరిగాయని చెప్పిన ఆ శాఖ కోటి రుపాయల పెనాల్టీ విధించింది.
కోడెల శివరాంకు చెందిన "గౌతమ్ హీరో షోరూంకు" జరిమాన ఎంతో తెలుసా?