Universities as Centers of Politics: రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను కొందరు ఉపకులపతులు రాజకీయాలకు కేంద్రాలుగా మార్చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంతో కాలంగా సంపాదించుకున్న ఘనకీర్తిని.. తన చర్యలతో ఉపకులపతి పీవీజీడీ ప్రసాదరెడ్డి గంగలో కలిపేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వీసీగా పనిచేసిన ఏయూ.. నేడు వివాదాలతో వార్తల్లోకెక్కుతోంది.
వీసీ ప్రసాదరెడ్డి, మాజీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ విశాఖలోని ఓ హోటల్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ఇటీవల సమావేశం నిర్వహించడం వివాదాస్పదమైంది. ఇదే కాదు గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించడంతోపాటు, ఫలితాలపై విద్యార్థులతో సర్వే చేయించినట్లు వీసీపై ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే తన ఛాంబర్‌లో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించడంతో పాటు.. గతేడాది తాడేపల్లిలో ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారు. తర్వాత ఎంపీ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు నన్ను కలిశారని ట్వీట్ చేసి, వెంటనే తొలగించారు. ఉపకులపతిని కూడా.. పార్టీ కార్యకర్తగా ఎంపీ పేర్కొనడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వర్సిటీల చట్టం ప్రకారం ఒక వ్యక్తి గరిష్ఠంగా ఆరేళ్లపాటే రిజిస్ట్రార్‌గా కొనసాగవచ్చనే నిబంధనతో.. మాజీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్‌ను.. వీసీ గతంలో ఆ పదవిలో నియమించారు. గతంలో అంబేడ్కర్ వర్సిటీలో పనిచేసింది లెక్కలోకి రాదని.. ఆరేళ్ల నిబంధన విశ్వవిద్యాలయం యూనిట్‌గానే వర్తిస్తుందని కొత్త భాష్యం చెప్పారు.
అంతే కాదు ఉద్యోగ విరమణ తర్వాత రెండుసార్లు ఆచార్యుడిగా పునర్నియమించి, రిజిస్ట్రార్‌గా కొనసాగించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రభుత్వ, పార్టీపరమైన కార్యక్రమాలకు విశ్వవిద్యాలయ ఆడిటోరియం, అతిథి గృహాలను కేటాయించారు.
వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా వర్సిటీ క్లాసులు రద్దుచేసి, ఒకరోజు సెలవు ప్రకటించి.. ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్‌కు క్యాంపస్‌లో స్థలం కేటాయించారు. ఉపకులపతిగా రాజశేఖర్ బాధ్యతలు చేపట్టినప్పుడు సీఎం జగన్ ఫొటోకు క్షీరాభిషేకం చేసి, జై జగన్ అంటూ నినదించారు.
జీవో-1కు మద్దతుగా ఇటీవల చర్చావేదిక నిర్వహించి హైకోర్టుతో చీవాట్లు తిన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌పై గతంలో ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈయన మున్సిపల్ ఎన్నికలప్పుడు వైఎస్సార్సీపీ సభలో మంత్రి పెద్దిరెడ్డిని కలవడం వివాదాస్పదమైంది.
నెల్లూరులోని విక్రమ సింహపురి వర్సిటీలో.. కొంతమంది రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్న ఉదాహరణలున్నాయి. ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదినం సందర్భంగా తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ముందు, ప్రాంగణంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు కట్టారు. రాయలసీమలో ఎంతో చరిత్ర ఉన్న ఈ వర్సిటీనీ రాజకీయ కార్యకలాపాలకు నిలయంగా మార్చడం విస్మయం కలిగిస్తోంది.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో.. ఇటీవల మృత్యుంజయ హోమం నిర్వహణకు సిబ్బంది నుంచి చందాల వసూలు చేయాలని నిర్ణయించి, విమర్శలు రావడంతో వెనక్కితగ్గింది. జాతీయ ర్యాంకుల్లో ఏపీలోని వర్సిటీలు దిగజారుతున్నప్పటికీ.. వీసీలు మాత్రం రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ ఫిర్యాదు: విశాఖలో ఫిబ్రవరి 19 తేదీ ఉదయం ఓ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ జరిపిన సమావేశంలో ఏయూ వీసీ పాల్గొన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ నజీర్ చెప్పారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. వీసీ.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలకు కేంద్రాలుగా యూనివర్సిటీలు మారుతున్నాయా..? ఇవీ చదవండి: