రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసులు ఇవాళ అనిశా కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ముగ్గురికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని అనిశా కోర్టు న్యాయమూర్తి సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్ నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేసిన పోలీసులు హైదరాబాద్‌కు చెందిన నందకుమార్, ఏపీలోని అన్నమయ్య జిల్లా చిన్న మండెం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం నిర్వహిస్తున్న సింహయాజి, ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి శంషాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లోనే ముగ్గురు నిందితులను విచారించారు.
ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర.. నిందితులకు రిమాండ్ తిరస్కరించిన న్యాయమూర్తి
తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అధికార తెరాస, భాజపా నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ కేసు నిందితులను పోలీసులు.. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.
అనంతరం ఇవాళ సాయంత్రం శంషాబాద్ గ్రామీణ పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితులను సరూర్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసానికి తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ ముగ్గురూ.. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ ప్రలోభపెట్టారని పోలీసుల అభియోగం. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేయడం.. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఇవీ చూడండి