ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు అనారోగ్యం వస్తే, కుటుంబాల ఆస్తులు కరిగిపోవల్సిందేనా..! - Hospital expenses in the country during the year

Average Hospital Cost Per Person: అనారోగ్యం వచ్చిందంటే చాలు పేద, మధ్యతరగతి ఆస్తులు కరిగిపోతున్నాయి. చిన్నపాటి రోగానికే కూడబెట్టినదంతా ఆస్పత్రుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇంకొంచెం పెద్ద రోగం వస్తే.. ఇక అంతే సంగతులు. పూర్తిగా అప్పులపాలవ్వాల్సిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి.

Etv Bharat
అనారోగ్యం వస్తే అప్పులపాలే

By

Published : Nov 27, 2022, 12:04 PM IST

Average Hospital Cost Per Person: అనారోగ్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆస్తులు కరిగిపోతున్నాయి. జీవితాంతం కొద్దోగోప్పో కూడబెట్టిన సొమ్మును చికిత్స అందించే ఆసుపత్రులకు ధారపోయాల్సి వస్తోంది. అదీ సరిపోక.. అప్పులపాలవుతున్నారు. క్యాన్సర్‌కు మరీ ఎక్కువగా ఖర్చవుతోంది. ఆ తర్వాత కార్డియోవాస్క్యులర్‌, కండరాలు, ఎముకల వ్యాధుల చికిత్సలకు డబ్బును అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2021 నివేదికలో ఈ ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అనారోగ్యాలు - ఖర్చుల వివరాలను ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరిన వారు.. పొదుపు మొత్తాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 79.5 శాతం, పట్టణాల్లో 83.7 శాతం చొప్పున ఖర్చుపెడుతున్నారు. రాష్ట్రంలో అనారోగ్యాలతో ఆసుపత్రుల్లో చేరిన వారు గ్రామీణ ప్రాంతాల్లో 52.2 శాతం, పట్టణ ప్రాంతాల్లో 62.9 శాతం చొప్పున తమ పొదుపు మొత్తాల నుంచి వెచ్చిస్తున్నారు.

గ్రామీణుల్లో 22.9 శాతం మందికి అసలు ఆరోగ్య బీమానే లేదు. ప్రభుత్వ బీమా 76 శాతం మందికి ఉంది. పట్టణాల్లో బీమా సౌకర్యం లేనివారు 37 శాతంగా ఉండగా.. ప్రభుత్వ బీమా ఉన్నవారు 55.9 శాతం మంది మాత్రమే. చికిత్సల కోసం 365 రోజుల్లో పురుషులు సగటున పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో 14 వందల 70 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 31 వేల 974 చొప్పున ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

కాన్పులు మినహా ప్రభుత్వాసుపత్రుల్లో మహిళలకు 923 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 24వేల 955రూపాయల చొప్పున అవుతోంది. చికిత్సల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వాసుపత్రుల్లో సగటున 11వందల 70 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 23 వేల 395రూపాయల చొప్పున పురుషులకు ఖర్చవుతోంది. మహిళలకు ప్రభుత్వాసుపత్రుల్లో 12వందల 62 రూపాయలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో 15వేల 761 రూపాయలు అవుతోంది.

ప్రసవం కోసం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో 987రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 16వందల 80రూపాయల చొప్పున ఖర్చవుతోంది. అదే ప్రైవేటు ఆసుపత్రుల్లోనైతే 23వేల 952 రూపాయలకు పైనే వెచ్చించాల్సి వస్తోంది. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో ప్రసవానికి ప్రభుత్వాసుపత్రుల్లో 11 వందల 74రూపాయల, ప్రైవేటు ఆసుపత్రుల్లో 23వేల 256రూపాయల చొప్పున ఖర్చవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ క్యాన్సర్‌ వ్యాధి చికిత్స కోసం బాధితులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఒక్కో క్యాన్సర్‌ రోగికి సగటున ఏడాదికి గ్రామీణ భారతంలో 56వేల 996 రూపాయలు, పట్టణాల్లో అయితే 68 వేల 259రూపాయల చొప్పున వ్యయం చేస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ ఆరోగ్య నివేదిక-2021

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details