R 5 Zone plots : ఆర్-5 జోన్‌లో పేదలకు పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని సీఆర్‌డీఏ కమిషనర్ కు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు లేఖలు రాశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు లబ్ధిదారుల జాబితా ఇచ్చారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఫొటోలు సేకరిస్తున్నారు. రెండు జిల్లాల కలెక్టర్లు అడిగిన భూమికి అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ లేఖ రాశారు. గతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదలకు 1134.58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు జిల్లాలలో లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా... ఎస్3 జోన్‌లో అదనంగా 268 ఎకరాలు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 26,739 మంది లబ్ధిదారులు, గుంటూరు జిల్లాలో 23,235 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేయనున్నారు. దీనికి అదనంగా ఎస్ 3 జోన్‌లో మరో 128 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు.
హద్దురాళ్ల తొలగింపు.. రాజధాని నిర్మాణానికి తామిచ్చిన భూములు ప్లాట్లు చేసి పంచడానికి వీల్లేదని రైతులు స్పష్టం చేశారు. కౌలు డబ్బులు చెల్లించకుండా, రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేయకుండా భూముల జోలికి రావద్దని హెచ్చరించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్లో పాతిన హద్దు రాళ్లను పీకేశారు. ఇళ్ల స్థలాల పంపిణీకి శరవేగంగా పావులు కదుపుతున్న ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. ఆర్-5జోన్‌లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన పలువురు రైతులు.. ప్లాట్లు వేసి పాతిన హద్దు రాళ్లను పీకేశారు. రిటర్న్‌బుల్ ప్లాట్ల అభివృద్ధి సంగతేంటో తేల్చాలని భీష్మించారు. తామిచ్చిన భూములకు కౌలు కూడా ఇవ్వకుండా ఎవరికో పంచేస్తామంటే ఎలా అని రైతులు నిలదీశారు.