కృష్ణా నదికి వచ్చిన వరదలు ప్రభుత్వం సృష్టించినవేనని...తెదేపా నేతలు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, అనగాని సత్య ప్రసాద్‌లు విమర్శించారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నారా లోకేశ్‌తో కలిసి నేతలు పర్యటించారు. ప్రభుత్వానికి చంద్రబాబు ఇంటిని, అమరావతిని ముంచాలనే ఆలోచన తప్ప వరద నియంత్రణపై దృష్టి లేదని ఆలపాటి రాజా దుయ్యబట్టారు. గతంలో చాలా సార్లు వరదలు వచ్చినా...ఎనాడు ఇబ్బందులు రాలేదన్నారు. ఈసారి ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టటంలో విఫలమైందని ఆరోపించారు.
అమరావతిలో ముంపు చూపాలనే దురాలోచన
అమరావతిలో ముంపు చూపాలనే దురాలోచన...ప్రభుత్వానికి మంచిది కాదని ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ వ్యాఖ్యానించారు. వరద నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమరావతి ప్రాంతానికి చెడ్డ పేరు తెచ్చేందుకు వరద పేరు చెబుతున్నారని మండిపడ్డారు. వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.