రాజధాని అమరావతిని కాపాడాలంటూ రాయపూడి మహిళలు... అమర లింగేశ్వరస్వామిని వేడుకున్నారు. ధర్నా శిబిరం నుంచి బయలుదేరిన మహిళలు... కృష్ణా జలాలను తీసుకొచ్చి అమరలింగేశ్వరునికి అభిషేకం చేశారు. జైఅమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. తమ పోరాటం ఫలించాలని... అమరావతిని చల్లగా చూడాలని మహాశివుడిని వేడుకున్నారు. 90 రోజులకు పైగా తాము పోరాటం చేస్తుంటే.. ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
మందడం, తుళ్లూరు, రాయపుడిలో రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. కరోనా వైరస్‌పై సీఎం జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ... పారాసిట్మాల్ మాత్రలు, బ్లీచింగ్ ప్యాకెట్లు ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. 9 నెలలు తర్వాత తొలిసారి మీడియా సమావేశం నిర్వహించిన జగన్...అమరావతి తరలింపు సహా కీలక సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మందడం దీక్షా శిబిరాన్ని సందర్శించిన మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, సీపీఐ నేతలు...రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదా పడ్డాయని బాధ పడుతున్న జగన్‌కు...తమ సమస్యలు పట్టడం లేదా అని రైతులు ప్రశ్నించారు.