భాజపా జాతీయ కార్యదర్శిని కలిసిన రాజధాని రైతులు - The farmers of the capital met with the national secretary of Bhajapa
రాజధాని అమరావతిలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తెలిపారు. గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రం వద్ద తనను కలిసిన రాజధాని రైతులతో ఆయన మాట్లాడారు.

గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుని రాజధాని రైతులు కలిశారు. రాజధాని కోసం భూములు ఇచ్చి బజారున పడ్డామని మహిళలు తమ ఆవేదనను ఆయన ఎదుట వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని మొరపెట్టుకున్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని మారుస్తున్నారని... కేంద్రం వెంటనే స్పందించాలని కోరారు. మూడు రాజధానుల వల్ల తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతులు చెప్పిన అంశాలను తమ పార్టీ ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.