సైఫ్ వేధింపులు మితిమీరిపోతున్నాయి.. ఆత్మహత్యాయత్నానికి ముందు తల్లితో ప్రీతి KMC PG Medical Student Suicide attempt : సీనియర్ వేధింపులు భరించలేక తెలంగాణలోని వరంగల్ ఎంజీఎంలో పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్యకు పాల్పడిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం ప్రీతి నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునే ముందు రోజు తల్లితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఫోన్‌లో ప్రీతి తన బాధను తల్లితో పంచుకున్నట్లు ఆడియో ఒకటి బయటకు వచ్చింది. సైఫ్ నాతో సహా చాలా మంది జూనియర్లను దారుణంగా వేధిస్తున్నారని చెప్పింది. సీనియర్లు అంతా ఒకటై వేధిస్తున్నారని ఆవేదన చెందింది. సైఫ్‌కు పోలీసులతో నాన్న ఫోన్ చేయించినా లాభం లేదని తెలిపింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తల్లి వద్ద వైద్య విద్యార్థిని బాధపడింది.
సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లు అందరూ ఒకటై తనను మరింత వేధిస్తారని ఆవేదన చెందింది. ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి రావాలి కాని ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్లడం ఏంటని హెచ్‌వోడీ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఈ మాటలు విన్న తల్లి.. సైఫ్‌తో మాట్లాడి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది.
గత నాలుగు రోజులుగా ఏఆర్‌సీయూలో ఎక్మో యంత్రం సాయంతో, వెంటిలేటర్పైప్రత్యేక వైద్య బృందం వైద్య విద్యార్థినికి చికిత్స చేస్తోంది. ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటిసారి ఎంజీఎంలో ఒక సారి గుండె ఆగిపోగా.. నిమ్స్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకూ గుండె అయిదుసార్లు ఆగినట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.. ప్రస్తుతం ప్రీతి మెరుగుపరిచేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: