Insulting judges Case: న్యాయమూర్తులు, న్యాయస్థానాల తీర్పులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న కేసులో నిందితులను రెండు రోజులపాటు సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. మరింత లోతైన విచారణ కోసం కస్టడీ అవసరమని భావిస్తున్నట్లు సీబీఐ అధికారులు గుంటూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితులు మెట్ట చంద్రశేఖర్, కళానిధి గోపాలకృష్ణ, గంటా రమేష్ కుమార్‌లను సీబీఐ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. బుధ, గురువారాల్లో నిందితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు. మూడు రోజుల క్రితం ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు.. గుంటూరులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
ముగ్గురు అరెస్టు..
న్యాయవ్యవస్థను కించపరుస్తూ, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ, బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ మరో ముగ్గుర్ని శనివారం అరెస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి, ఏపీఈపీడీసీఎల్‌కి స్టాండింగ్ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న న్యాయవాది మెట్ట చంద్రశేఖర్‌రావు (ఏ18), న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి (ఏ19), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుంట రమేష్‌కుమార్ (ఏ20)లను శనివారం ఉదయం హైదరాబాద్‌లో అదుపులో తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని సీబీఐ ప్రత్యేకకోర్టులో హాజరుపరిచారు. విచారణకు హాజరుకావాలంటూ ఈ నెల పదో తేదీనే ఈ ముగ్గురికీ సీబీఐ అధికారులు సీఆర్‌పీసీలోని సెక్షన్ 41 ఏ నోటీసులు ఇచ్చారు. దీంతో వీరు శనివారం హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. నిందితులు విచారణకు సహకరించట్లేదని పేర్కొంటూ వారిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుంటూరుకు తీసుకొచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో సీబీఐ ప్రత్యేకకోర్టు జడ్జి పొన్నూరు బుజ్జి ఎదుట హాజరుపరిచారు.
ఇదీ చదవండి : Insulting judges Case:జడ్జిలను దూషించిన కేసులో ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్ చంద్రశేఖర్ అరెస్ట్