FORMULA E-RACE COUNT DOWN START: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-రేస్ నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ముంబయిలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఈ- రేస్ 30 రోజుల కౌంట్‌డౌన్ కార్యక్రమం జరిగింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మంత్రి కేటీఆర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఫార్ములా- ఈ రేస్ నిర్వహణకు.. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు పోటీపడగా అన్నింటిని ఓడించి హైదరాబాద్ ఆ అవకాశాన్ని దక్కించుకుందని మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని.. విద్యుత్ వాహనాలతో కాలుష్య సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఫార్ములా-ఈ రేస్‌లో 9 దేశాల నుంచి ఏస్‌గ్రాండ్‌స్టాండ్‌లు, జాగ్వార్, నిస్సాన్, మహింద్రా రేసింగ్ వంటి 11 జట్లు 22 కార్లతో పాల్గొంటాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 5 నుంచి వారం రోజులపాటు మొబిలిటీ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉత్పాదక సంస్థలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థ నిర్వాహకులు పాల్గొంటారని.. తద్వారా దేశానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ దేశంలో తొలిసారిగా విద్యుత్ వాహనాల విధానం తెచ్చిందని గుర్తుచేసిన కేటీఆర్.. ఆ రంగంలో స్టార్టప్ కంపెనీలు భారత్ వచ్చేలా కృషిచేద్దామని పిలుపునిచ్చారు.