రేపు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర కౌన్సిల్ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఇంఛార్జ్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో జడ్పీ ఉన్నత పాఠశాలలను.. డీఈవో గంగాభవానితో కలసి పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు.
ప్రత్తిపాడులో రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం జరపనున్నామని.. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరవుతారని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది సమ్మేటివ్ 1, 2 పరీక్షలు ఉండవని... నేరుగా ఏప్రిల్ నెలలో చివరి పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను త్వరలోనే అందిస్తామని ప్రతాప్ రెడ్డి చెప్పారు.