ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tension at Jonnalagadda: పల్నాడులో మరోసారి ఉద్రిక్తత.. తెదేపా నేత చదలవాడకు అస్వస్థత! - జొన్నలగడ్డలో తెదేపా నాయకుల ధర్నాలో ఉద్రిక్తత

TDP leaders dharna at Jonnalagadda
జొన్నలగడ్డలో తెదేపా నాయకుల ధర్నాలో ఉద్రిక్తత

By

Published : Jan 15, 2022, 7:20 PM IST

Updated : Jan 15, 2022, 9:35 PM IST

19:16 January 15

అస్వస్థతకు గురైన తెదేపా నేత చదలవాడ అరవిందబాబు

జొన్నలగడ్డలో తెదేపా నాయకుల ధర్నాలో ఉద్రిక్తత

Tension Situation in Jonnalagadda: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గురువారం రాత్రి జొన్నలగడ్డలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు మాయం చేశారు. దీంతో శుక్రవారం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వైకాపా శ్రేణులు గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. విగ్రహాన్ని మాయం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుల ఫిర్యాదు మేరకు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన తెదేపా నేతలు అనిల్‌, రాజేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నరసరావుపేట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో విచారించకుండా ఎక్కడికో తీసుకెళ్లి విచారిస్తున్నారని తెదేపా నాయకులు జొన్నలగడ్డలో ఆందోళనకు దిగారు.

అరవిందబాబుకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Tdp Leader Chadalavada Aravinda Babu: తెదేపా శ్రేణులు గుంటూరు- కర్నూలు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి డౌన్‌.. డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసులు రంగంలోకి దిగి ధర్నా విరమించాలని తెదేపా నాయకులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో పోలీసులు బలవంతంగా తెదేపా నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను చెదరగొట్టి అరవిందబాబును బలవంతంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. తోపులాట జరగడంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. పార్టీ శ్రేణులు వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు ఏం చేస్తున్నారు ..? - చంద్రబాబు

తెదేపా నరసరావుపేట ఇంఛార్జ్ అరవింద్ బాబుపై దాడిని ఖండిస్తున్నట్లు ఆపార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ లపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. తెదేపా శ్రేణులపై వైకాపా వారు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అస్వస్థతకు గురైన తెదేపా నేతలను తరలించే అంబులెన్స్ పైనా దాడికి దిగడం వైకాపా ఆరాచకానికి, పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఘర్షణకు కారణమైన వైకాపా కార్యకర్తలతో పాటు పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

చర్యలు తీసుకోవాలి - అచ్చెన్నాయుడు

పండుగపూట కూడా రాష్ట్రంలో అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెదేపా నేతల అక్రమ అరెస్టులను ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద్‍బాబుపై పోలీసులు, వైకాపా నేతల దౌర్జన్యం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు.దాడికి పాల్పడిన వైకాపా శ్రేణులు, అందుకు సహకరించిన పోలీసులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు - లోకేశ్

నరసరావుపేటలో జరిగిన ఘటనను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. సంబంధం లేని విషయంలో తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ బాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేయటాన్ని తప్పుబట్టారు. ఆస్పత్రికి తరలిస్తున్న అంబులెన్స్ పై వైకాపా రౌడీ మూకలు దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

వైకాపా కార్యకర్తలు బరితెగించారు - యనమల

రాష్ట్రంలో వైకాపా అరాచకాలు, పోలీసుల దౌర్జన్యాలు రాజ్య మేలుతున్నాయని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అధికార అండతో వైకాపా నేతలు, కార్యకర్తలు బరితెగించి ప్రవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవిందబాబు పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీసేలా వ్యహరించడం దుర్మార్గమన్నారు.

డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలి - అశోక్​బాబు

రాష్ట్రంలో పోలీసులే వైకాపా కార్యకర్తల మాదిరిగా మారి తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులకు దిగడం ఆందోళన కలిగిస్తోందని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. జొన్నలగడ్డ గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తెదేపా కార్యకర్తలపై పోలీసుల దాడికి దిగారని ఆరోపించారు. చదలవాడ అరవింద్ బాబుపై అత్యంత కర్కశంగా దాడిచేశారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారి రాక్షసుల్లా దాడికి తెగబడటం చూస్తే రాష్ట్రంలో జగన్ స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం అంతరించిపోయినట్లుగా కన్పిస్తోందని విమర్శించారు. అరవింద్ బాబు ప్రాణాలకు ఎటువంటి ముప్పు సంభవించినా పోలీసులే ఇందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహాన్ని వైకాపా నాయకులే మాయం చేసి ఆ నెపాన్ని తెదేపా కార్యకర్తలపై నెట్టి అక్రమ అరెస్ట్ చేశారని మండిడ్డారు. ఇందుకు నిరసనగా తమ శ్రేణులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఒక్కసారిగా మీదపడి లాఠీచార్జీకి దిగడం హేయమన్నారు. తెదేపా శ్రేణులపై దాడికి దిగి గాయపర్చిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ప్రియుడు తిట్టాడని.. యువతి దారుణ నిర్ణయం!

Last Updated : Jan 15, 2022, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details