Amaravati Farmers MahaPadayatra : అభివృద్ధికి దూరంగా, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నరాష్ట్రానికి ఏకైక ఆశాకిరణం అమరావతేనని చాటుతూ...అన్నదాతలు మహాపాదయాత్రలో ఉరిమే ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. ఆంధ్రా ప్యారిస్ తెనాలిలో స్థానికులు నుంచి లభించిన అఖండ మద్దతు...రైతుల్లో ఉద్యమ స్ఫూర్తిని రెట్టింపు చేసింది. మంత్రుల విమర్శలు, పోలీసుల ఆంక్షలకు వెరవక.. మహోన్నత లక్ష్య సాధన వైపు అడుగులు వేయించింది.
5కోట్ల ఆంధ్రులకు మంచి జరగాలని, భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర తరగని ఉత్సాహంతో, ఎనలేని ఆత్మవిశ్వాసంతో సాగుతోంది. మూడో రోజు దుగ్గిరాల నుంచి యాత్ర ప్రారంభించిన అన్నదాతలు.. చింతలపూడి, నందివెలుగు, కంచర్లపాలెం, కఠేవరం మీదుగా తెనాలి చేరుకున్నారు. దారి పొడవునా రైతులకు స్థానికుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎక్కడికక్కడ పూలతో స్వాగతం పలికారు. ప్రభుత్వం చేతిలో మోసపోయి..ప్రజల వద్దకు వచ్చిన అన్నదాతలకు అండగా నిలిచారు.
తెనాలి వీఆర్ఎస్ కళాశాల ప్రాంగణంలో మధ్యాహ్న భోజనం చేసిన రైతులు...పట్టణంలో యాత్ర కొనసాగించారు. స్థానిక ఐతానగర్ వాసులు అమరావతి పాదయాత్రకు 5.50 లక్షల విరాళాన్ని ఆలపాటి రాజా చేతుల మీదుగా అందజేశారు. పట్టణ పురవీదుల్లో తిప్పుతూ పూల వర్షంతో రైతులకు స్వాగతం పలికారు. అన్నదాతలకు మద్దతుగా తెనాలిలో జనప్రవాహం పోటెత్తింది. పట్టణంలో ఐదు కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. తమ ప్రాంతం మీదుగా పాదయాత్ర చేయాలని ఐతానగర్ వాసులు కోరగా అన్నదాతలు అందుకు అంగీకరించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే నివాసం ఉండటంతో...అటుగా పోలీసులు పాదయాత్రకు అనుమతించలేదు. దాంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అనంతరం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి గాంధీచౌక్, బోసు రోడ్డు, చినరావూరు, జగ్గడిగుంటపాలెం, పెదరావూరు వరకూ ఎక్కడా జనం హోరు ఆగలేదు. రైతుల్లో ఊపు తగ్గలేదు. బీసీ సంఘం, న్యాయవాదులు, మైనార్టీ సంఘాల నేతలు పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. వైకాపా ప్రభుత్వ అసమర్ధ పాలన వల్ల రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లైనా రాజధాని లేని రాష్ట్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతులు ఎంతో సహనంతో ఉన్నప్పటికీ మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఐకాస నేతలు హితవు పలికారు.
నాలుగో రోజైన నేడు రైతుల మహా పాదయాత్ర పెదరావూరు నుంచి జంపని, వేమూరు మీదుగా కొల్లూరు వరకూ సాగనుంది.
ఇవీ చదవండి: