ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట బైపాస్‌ టెండర్లు రద్దు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్ రహదారి నిర్మాణం మరింత ఆలస్యం కానుంది. ఈ పనులు దక్కించుకున్న బీఎస్​సీపీఎల్ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. త్వరలో తిరిగి టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.

chilakaluripet bypass
chilakaluripet bypass

By

Published : Oct 20, 2020, 5:02 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట బైపాస్‌ రహదారి నిర్మాణం మళ్లీ మొదటికి వచ్చింది. పనులు దక్కించుకున్న బీఎస్​సీపీఎల్‌ గుత్తేదారు కంపెనీ నిర్మాణం చేపట్టడంలో తీవ్ర జాప్యం చేయటంతో టెండర్లు రద్దు చేశారు. పేట బైపాస్‌ కావాలని, వద్దని కోర్టులో ఏళ్ల పాటు వాదోపవాదనలు సాగాయి. చివరకు బైపాస్‌ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంతో యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నుంచి బొప్పూడి కోనాయికుంట వరకు 16.3 కి.మీ దూరం బైపాస్‌ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. భూసేకరణ అనంతరం ఆరు వరుసల రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. గత ఏడాది మొదట్లో పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద బేస్‌క్యాంప్‌ ఏర్పాటు చేసుకుంది. నిర్మాణంలో భాగంగా కుప్పగంజి, ఓగేరు వాగులపై వంతెనల నిర్మాణం, మరో మూడు మేజర్‌ వంతెనలు, ఆరు అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తిమ్మాపురం, నాదెండ్ల, గణపవరం, పురుషోత్తమపట్నం, మురికిపూడి పరిధిలోని 581 మంది రైతులకు సంబంధించిన భూములకు 95 శాతం పరిహారం కూడా చెల్లించారు. కొన్నిచోట్ల భూమిని చదును చేసే పనులు పూర్తి చేశారు. అంతలోనే కరోనా విజృంభించటంతో పనులు నిలిచిపోయాయి.

కొత్తగా టెండర్లు పిలుస్తాం

చిలకలూరిపేట బైపాస్‌కు సంబంధించి పనులు దక్కించుకున్న గుత్తేదారు జంగిల్‌ క్లియరెన్స్‌, హద్దు రాళ్ల ఏర్పాటు పనులు మాత్రమే పూర్తి చేశారు. కాంక్రీట్‌ పని ఏమాత్రం మొదలు పెట్టింది లేదు. దీనికితోడు కరోనా వైరస్‌ వ్యాప్తి పెరగడంతో కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఏప్రిల్‌ నుంచి పూర్తిగా పనులు నిలిచిపోయాయి. పనులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో జాతీయ రహదారులు సంస్థ నిబంధనల మేరకు టెండర్లను రద్దు చేసింది. దీనివల్ల ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 'చిలకలూరిపేట బైపాస్‌ పనులు చేపట్టడంలో బీఎస్​సీపీఎల్ కంపెనీ తీవ్ర జాప్యం చేయటంతో టెండర్లు రద్దు చేశాం. త్వరలో తిరిగి కొత్తగా టెండర్లు పిలుస్తామ'ని జాతీయ రహదారుల నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

సిగరెట్ కోసం వచ్చి..గొలుసుతో పరార్

ABOUT THE AUTHOR

...view details