ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ప్రాంతాలలో ఆకాశన్నంటిన కౌలు ధరలు.. ఎందుకంటే..! - Guntur Mirchi

మిరప సాగు ఎక్కువ ఉండటంతో.. గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలలో కౌలు ధర ఆకాశాన్ని తాకుతోంది. మిగతా వాణిజ్య పంటల పరిస్థితి అంతా ఆశాజనకంగా ఉండకపోవటంతో.. మిర్చినే వేలాది హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఎకరాకు సుమారు రూ.10 వేలు కౌలు రేట్లు ఎగబాకాయి. ఇప్పుడు జిల్లాలోని లేమల్లెపాడులో ఎకరం కౌలు 76వేలుగా ఉంది.

tenant cultivation  prices hike at guntur district
లేమల్లెపాడులో పెరిగిన కౌలు ధర

By

Published : Jul 14, 2021, 12:55 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మిరప సాగు చేయడానికి ఆసక్తి పెరగడంతో ఇదే అదనుగా కౌలు ధరలు పుంజుకుంటున్నాయి. గతేడాది వరి, పత్తి పంటలు తీవ్ర నిరాశ కలిగించడం, గడిచిన రెండేళ్లుగా మిర్చి సాగు ఆశాజనకంగా ఉండటంతో ఈఏడాది కూడా ఇదే ఒరవడి కనిపిస్తోంది. జిల్లాలో మిర్చి సాగు సాధారణ విస్తీర్ణం 60వేల హెక్టార్లు కాగా ఏటికేడు పెరుగుతోంది. గతేడాది 74వేల హెక్టార్లలో సాగు చేయగా, ఈ ఏడాది లక్ష హెక్టార్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

ఇదే అదనుగా కౌలు ధరలు పెరుగుతున్నాయి. కాలువలు, బావుల ద్వారా నీటి వసతి, రహదారి సౌకర్యం, మెరక పొలాలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. కొన్నిచోట్ల తొలుత పచ్చికాయలు, తర్వాత ఎండుమిర్చి తీసుకునే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని పొలాలకు గిరాకీ ఉంది. తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, రాజుపాలెం, మేడికొండూరు మండలాల్లో పొలాలకు కౌలు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామం యజమానులకు కొంత కలిసివస్తుండగా కౌలుదారులకు మాత్రం ఆఖరి క్షణం వరకు ఉత్కంఠ పరిస్థితిని రేకెత్తిస్తోంది.

లేమల్లెపాడులో ఎకరం కౌలు 76వేలు

వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో మిరప సాగు చేసే పొలాల కౌలు ధరలు ఈఏడాది బాగా పెరిగాయి. లేమల్లేపాడు గ్రామంలో రికార్డుస్థాయిలో ఎకరం కౌలు ధర రూ.76వేలకు పెరగడం గమనార్హం. ఎప్పుడూ లేనంతగా అధికంగా ధరలు పెరగడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత మొత్తం పెరుగుదల లేదని గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి సంవత్సరం కౌలు రేట్లు పెరుగుతూనే ఉన్నా కేవలం మిర్చి పండించే భూములకు మాత్రమే ఈ పెరుగుదల కనిపిస్తోంది.

లేమల్లెపాడులో నాలుగు ఎకరాల భూమికి ఎకరం రూ.76వేల చొప్పున కౌలు పలికింది. ఇదే గ్రామంలో పొలాలకు ఎకరం రూ.65వేల నుంచి రూ.68వేలు భూయజమానులకు లభించింది. ముట్లూరులోనూ ఎకరం రూ.50వేల నుంచి రూ.65 వేల మధ్యన ధరలు పలుకుతున్నాయి. మండలంలో ఈరెండు గ్రామాల్లోనే ఈపరిస్థితి ఉంది. ఈ ఒరవడి సంకర మిర్చిని అత్యధికంగా చేసే ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు, రావెల, మందపాడు, బండారుపల్లిలో రూ.40వేల వరకు కౌలు ఉంది.

సత్తెనపల్లి, పెదకూరపాడు, క్రోసూరు మండలాల్లో కూడా రూ.35వేల నుంచి రూ.40వేలు కౌలు ధర పుంజుకుంది. ఈ ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఎకరాకు సుమారు రూ.10వేలు కౌలు రేట్లు ఎగబాకాయి. అయితే ఇందుకు భిన్నంగా మెజారిటీ విసీˆ్తర్ణంలో సాగయ్యే వరి, పత్తి పొలాల కౌలు ధరలు దిగజారిపోవడం కనిపిస్తోంది. వరి పండే డెల్టా ప్రాంతంలో భూములను కౌలుకు తీసుకొనేందుకు అంతగా ఆసక్తిచూపకపోవడం గమనార్హం.

మిరప సాగు అనూహ్యంగా పెరిగితే ఇబ్బందే..

రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు పెరుగుతున్నందున సాధ్యమైనంత వరకు సాగు విస్తీర్ణాన్నీ నియంత్రించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. విసీˆ్తర్ణం పెరగడంతోపాటు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లయితే మార్కెట్లో డిమాండ్‌ తగ్గి ధరలు తగ్గే ప్రమాదం ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తగిన రీతిలో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది సాగుచేసిన మిర్చి ఇప్పటికీ పెద్దఎత్తున శీతల గోదాముల్లో నిల్వలు ఉన్నాయి.

వచ్చే సీˆజన్‌లో మార్కెట్ ఎలా ఉంటుందో విశ్లేషించుకోవాలని సలహా ఇస్తున్నారు. జిల్లాలో సాగయ్యే మిరప విస్తీర్ణంలో సుమారు 50శాతం వరకు కౌలుదారుల భాగస్వామ్యంలోనే ఉంది. భూమి యజమానులు అంగీకరించకపోవడంతో సింహభాగం కౌలుదారులకు కార్డులు అందడం లేదు. ఫలితంగా బ్యాంకు నుంచి పంట రుణాలు మంజూరుకాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుని రైతులు ఎంతో కొంత సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవడం ఉత్తమమని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

ఎకరాకు రూ.10వేలు పెరిగింది

ఈఏడాది పొలాలు కౌలుకు చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడటంతో ప్రత్యేకించి మిర్చి పొలాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రకృతి విపత్తుల సంభవించినా నష్టం లేకుండా ఉండే భూములకు ఎక్కువ కౌలు చెల్లిస్తున్నారు. గతేడాదితో పోల్చితే మిర్చి సాగు చేసే భూములకు ఎకరానికి రూ.10వేలు కౌలు పెరిగింది. అయినప్పటికీ కౌలుదారులు మిర్చి సాగును అధికంగా చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. - మేడా హరిబాబు, మిరప రైతు, బండారుపల్లి

ఇదీ చూడండి:

godavari flood: పాపం నిర్వాసితులు... కొండమీదే తలదాచుకున్నారు..!

ABOUT THE AUTHOR

...view details