గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువకుడు షేక్ అబ్దుల్లా.. అన్నాబత్తుని సత్యనారాయణ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సైన్స్‌పై ఆసక్తితో విద్యార్థి దశ నుంచే ప్రయోగాలు చేసేవాడు. కొత్త పరికరాలు తయారుచేసి వాటిని విజ్ఞాన ప్రదర్శనలకు తీసుకెళ్లేవాడు. అదే దారిలో ఇప్పుడో కొత్త పరికరం తయారు చేశాడు.
సైకిలే.. బైక్‌లా
సైకిల్... గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే ప్రయాణ సాధనం. దాన్ని నడపడానికి కొంత శారీరక శ్రమ అవసరమవుతుంది. అలా కాకుండా బైక్‌లా.. తొక్కకుండానే వెళ్లేలా.. పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఉండేలా తయారు చేయాలనుకున్నాడు అబ్దుల్లా. సౌరశక్తితో నడిచే సైకిల్ రూపొందించాడు. సాధారణ సైకిల్‌కు సౌరఫలకాలు జోడించి, వాటిని బ్యాటరీకి అనుసంధానించాడు. ఆ సౌరశక్తి ద్వారా వాహనం నడిచేలా ఏర్పాటు చేశాడు. తొక్కకుండానే వెళ్లేలా దాన్ని రూపొందించాడు. దీని తయారీకి రూ. 12వేలు ఖర్చు అయిందని అబ్దుల్లా తెలిపాడు.