గుంటూరు జిల్లా తెనాలి సబ్ జైలులో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వీర శంకర్రావు అనే ఖైదీ మృతి అంశంపై అధికారులను ఉద్యోగులు తప్పుదోవ పట్టించారని కారాగార పర్యవేక్షక అధికారి ఆర్. వి. ప్రసాద్ చెప్పారు. జైలు ఇంచార్జీ సూపరింటెండెంట్ రాములు నాయక్, జైలు సిబ్బంది చిట్టిబాబు, రంగారావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
గుండెపోటుగా చిత్రీకరించి
రిమాండ్ ఖైదీ వీర శంకర్రావు.. బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి అందరినీ తప్పుదోవ పట్టించారు.
కుమారుడి అనుమానం
మెడపై ఉన్న గాయం చూసిన ఖైదీ కుమారుడు అనుమానం వ్యక్తం చేశారు. తన తండ్రి గుండెపోటుతో మరణించలేదని.. జైలులోనే హత్య చేశారని ఆరోపించారు. తమ ప్రత్యర్థులు జైలు సిబ్బందితో కుమ్మక్కై ఆయన్ను హత్య చేయించి ఉండవచ్చని అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆనవాళ్ల కారణంగా..
రిమాండ్ ఖైదీ వీర శంకర్రావుమృతిపై తెనాలి సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలోని బృందం విచారణ చేపట్టింది. లుంగీతో ఉరి వేసుకున్నారని జైలు సిబ్బంది వెల్లడించారు. దీంతో అసలు కారణాలను తేల్చేందుకు ఖైదీ శంకర్రావు మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పంచనామా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:తెనాలిలో రిమాండ్ ఖైదీ మృతిపై సబ్ కలెక్టర్ విచారణ