తెనాలి హత్య కేసులో నిందితుల అరెస్ట్ .. - tenali crime news
తెనాలిలో ఈనెల 12న రౌడీ షీటర్‌ను హత్య చేసిన నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను పట్టణంలోని హైస్కూలు సమీపంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ స్రవంతి అభినందించారు.
గుంటూరు జిల్లా తెనాలిలో ఈ నెల 12వ తేదీన జరిగిన చప్పిడి తరుణ్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో నిందితులను త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు షేక్ అక్బర్, కొండా రాజశేఖర్, సంగటి ఈశ్వర్ చరణ్ రెడ్డిలను కోర్టులో హాజరు పరచనున్నామని డీఎస్పీ శ్రవంతి రాయ్ తెలిపారు.
కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడని...
'మృతుడు చప్పిడి తరుణ్ కుమార్, అక్బర్, కొండా రాజశేఖర్, సంగతి ఈశ్వర్ చరణ్ స్నేహితులు. తరుణ్ కుమార్, రాజశేఖర్, అక్బర్ పలు క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వీరిద్దరిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. వారిద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఎవరికి వారు విడిగా తిరుగుతున్నారు. తరుణ్ కుమార్ గత కొన్ని రోజులుగా మద్యం తాగి బహిరంగ ప్రదేశాలలో అందరి ముందు అక్బర్ కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. దీనితో అక్బర్.. తరుణ్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితులైన కొండా రాజశేఖర్, ఈశ్వర్ చరణ్ రెడ్డిలను సహాయం కోరగా దానికి వారు అంగీకరించారు. పథకం ప్రకారం 12వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో పట్టణంలోని అమరావతి ఫ్లాట్స్, వాటర్ ట్యాంక్ సమీపంలో తరుణ్ ఓ హోటల్లో టిఫిన్ చేస్తుండగా.. వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పారిపోయారు. తీవ్రంగా గాయపడిన తరుణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని' డీఎస్పీ స్రవంతి రాయ్ చెప్పారు. హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి