తెనాలి మున్సిపాలిటికి 112 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. ఎప్పుడో 1909లోనే ఈ పట్టణం మున్సిపాలిటిగా ఏర్పడింది. గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి గుండెకాయ వంటిది తెనాలి పట్టణం. కవులు, కళాకారులు, పోరాటాలకు పుట్టినిల్లుగా భాసిల్లుతూ వస్తోంది. బ్రిటీషు కాలం నుంచే మంచి వ్యాపార కేంద్రంగా పేరుగాంచింది. ఇలాంటి ఎన్నో విశిష్టతలున్న తెనాలిలో మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా, తెదేపా పాగా వేసేందుకు ధీటుగా పోరాడుతున్నాయి.
మున్సిపాలిటీ జనాభా 2 లక్షలు కాగా.. లక్షా 55 వేల మంది ఓటర్లున్నారు. గత పాతికేళ్లలో కాంగ్రెస్, తెదేపా చెరో రెండుసార్లు ఇక్కడ గెలుపొందాయి. పట్టణంలో మొత్తం 40 వార్డులున్నాయి. మైనార్టీలు, యాదవుల జనాభా ఎక్కువగా ఉండటంతో ఎన్నికల్లో గెలుపుఓటముల్ని వారే నిర్దేశించనున్నారు. ఈ సారి తెదెపా, వైకాపా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
మాజీమంత్రి, తెదేపా సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ మున్సిపాలిటిలో ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. గత రెండేళ్లుగా వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆస్తిపన్ను పెంచటం ద్వారా ప్రజలపై పడే భారాన్ని వివరిస్తోంది. తమని గెలిపిస్తే ఆస్తిపన్ను పెంచబోమని హామీ ఇస్తున్నారు. ప్రశాంతంగా ఉండే తెనాలిలో వైకాపా అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, నేరాలు పెరిగాయని.. అలాంటి వాతావరణం పోవాలంటే తెదేపాకు ఓట్లేయాలని ఆ పార్టీ అభ్యర్థులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెనాలి మున్సిపాలిటికి సెలక్షన్ గ్రేడ్ హోదా కోసం 20 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినా ఇప్పటికి ఆమోదం రాలేదు. సెలక్షన్ హోదా వస్తే మున్సిపాలిటికి వచ్చే నిధులు పెరుగుతాయి. పట్టణంలో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారింది. బయటి గ్రామాల నుంచి విజయవాడ, గుంటూరు వైపు వెళ్లేందుకు 40 కోట్ల రూపాయలతో రింగురోడ్డు నిర్మాణం ప్రారంభమైనా.. వైకాపా అధికారంలోకి వచ్చాక పనుల నిలిపివేశారు.