గుంటూరు జిల్లా తెనాలి ఆసుపత్రిలో పని చేస్తొన్న ఓ వైద్యుడి విషాదాంతమిది. తెనాలి డివిజన్ జిల్లా ఉప వైద్యారోగ్యశాఖాధికారి జె. నరసింహ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి ఆసుపత్రిలో పని చేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి ఒకరికి ఇటీవల కరోనా సోకింది. శనివారం ఇక్కడి వైద్యులు, సిబ్బంది స్వాబ్ పరీక్ష చేయించుకున్నారు.
ఆదివారం వెల్లడైన ఫలితాల్లో ఓ వైద్యుడు, నర్సు, పారిశుద్ధ్య ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. అప్పటికే అస్వస్థతకు గురైన వైద్యుడిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి ఆయనకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రాష్ట్ర కొవిడ్ కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున వైద్యుడు కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.