Weather Report:కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతిలోని వాతావరణ విభాగం తెలియజేేసింది. తూర్పుగోదావరి సహా మన్యం, విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, నంద్యాల తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. రాగల 2 -3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చాలాచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేసింది.చాలా చోట్ల పిడుగులు పడే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాయలసీమ జిల్లా అనంతపురంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు: తాడేపల్లి గూడెం 40.21, శ్రీకాకుళం 40.2 డిగ్రీలు, కడప - 39.93, ఏలూరు - 39.85, తూర్పుగోదావరి 39.63 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడ -39.28 డిగ్రీలు, నంద్యాల 39.11, ప్రకాశం 39.09, నెల్లూరు 39.07, తిరుపతి 39 డిగ్రీలు మేర రికార్డు అయ్యింది. ఇక కోనసీమ లో 38.99, పశ్చిమగోదావరి 38.8 కృష్ణా 38.71, ఎన్టీఆర్ 38.68, అనకాపల్లి 38.5, విజయనగరం 38.5, బాపట్ల 38.4, పార్వతీపురం మన్యం 37.7 అన్నమయ్య 37.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. గుంటూరు 37.6, పలనాడు 37.5, చిత్తూరు 37.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది..
రేపు రాష్ట్రంలో ఎండల ప్రభావం:రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రేపు 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఎల్లుండి 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. అలాగే ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సమాచారం అందించింది.