Telugu Students on Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్లోని తెలుగు విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్కడి యుద్ధ వాతావరణం కారణంగా ఉక్కిరిబిక్కిరవుతున్న విద్యార్థులు.. స్వదేశానికి వచ్చేందుకు అగచాట్లు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లిన అనేక మంది ఇంకా అక్కడే ఉండిపోయారు. ఏపీ నుంచే 700 మంది విద్యార్థులు అక్కడే ఉన్నట్లు సమాచారం.
అక్కడి నుంచి విద్యార్థులను తరలించేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నారు. రుమేనియా, పోలండ్ దేశాలకు వెళ్లడానికి కొంతమందిని బస్సుల్లో పంపించారు. అయితే అక్కడి ఎయిర్ పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలోనే విద్యార్థులను దించేస్తున్నారు. దీంతో.. మోయలేని లగేజీతో నరకయాతన అనుభవిస్తూ.. ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు.
మరికొందరిని రుమేనియా, పోలండ్ సరిహద్దులో ఆపేస్తున్నారు. దీంతో.. సరిహద్దుల్లో వేలాది మంది రోడ్లపై ఉండిపోయారు. వారిలో తమ స్నేహితులు కూడా ఉన్నట్లు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థులు తెలిపారు. అధికారికంగా అనుమతి ఉన్న వారిని మాత్రమే సరిహద్దుల్లోకి రానిస్తున్నారు. తొందరపడి సరిహద్దులోకి రావొద్దని వారు సూచించినట్లు లిఖిత అనే విద్యార్థిని వెల్లడించింది.