ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2021, 8:09 PM IST

ETV Bharat / state

Soldier: ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం..తెలుగు జవాన్ వీరమరణం

చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనేది ఆ యువకుడి కోరిక. అనుకున్నట్లుగానే భారత సైన్యంలో చేరాడు. మాతృభూమి సేవలో తరించాడు. విధి వక్రించి ఉగ్ర మూకల దాడి నుంచి దేశాన్ని రక్షించుకునే క్రమంలో వీర మరణం పొందారు. జమ్ము సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో తెలుగు బిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu soldier died in terror attack at jammu
ఉగ్రమూకలతో వీరోచిత పోరాటం..తెలుగు జవాన్ వీరమరణం

గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి దేశం సేవలో ప్రాణాలు విడిచారు. శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మల ముగ్గురు సంతానంలో జశ్వంత్ పెద్దవాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న జశ్వంత్..2015 డిసెంబరులో ఆర్మీలో చేరారు. మద్రాసు రెజిమెంట్​​లో సైనికుడిగా చేరి..గత ఆరేళ్లుగా వివిధ ప్రాంతాల్లో పని చేశాడు. రెండేళ్ల క్రితం విధి నిర్వహణలో భాగంగా జమ్ము సరిహద్దులకు వెళ్లారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌలి జిల్లా సుందర్భనీ సెక్టార్‌లో గురువారం రాత్రి ఉగ్రవాదులకు, జవాన్‌లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్ వీరమరణం పొందారు.

నెల రోజుల్లో పెళ్లి చేద్దామనుకునుకుంటే..

జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం గ్రామానికి చేరుకోనుంది. నెల రోజుల్లో పెళ్లి చేద్దామనుకున్నామని..అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడని జశ్వంత్‌ కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు ఇక లేడని..ఆ తల్లి అంతులేని ఆవేదనకు గురైంది. తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. జశ్వంత్‌ దేశం కోసం ప్రాణాలు కోల్పోవడం గర్వంగా ఉన్నా..చిన్న వయసులో మరణించడం బాధగా ఉందని ఆయన సోదరుడు కన్నీరుమున్నీరయ్యారు.

శనివారం అంత్యక్రియలు

జశ్వంత్ రెడ్డి మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందు కోసం గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. జశ్వంత్ చాలా సాదాసీదాగా ఉండేవాడని స్నేహితులు కన్నీటిపర్యంతయ్యారు. సెలవులపై ఇంటికి వచ్చినప్పుడు పొలం పనులకు కూడా వెళ్లేవాడని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రముఖుల సంతాపం

వీర జవాన్‌ మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, హోం మంత్రి సుచరిత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

ఇదీ చదవండి

sucharitha: 'అమర జవాన్ జశ్వంత్​ రెడ్డి సేవలు మరువలేనివి'

ABOUT THE AUTHOR

...view details