Chandrababu fire on CM Jagan : సైకో చేతిలో రాష్ట్ర రాజధాని ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగంపై చేసిన ప్రమాణానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేసే విధ్వంసాలను సరిదిద్దటం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధాని పై స్పష్టంగా ఉన్నా.. 3రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఆక్షేపించారు. చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు. పార్లమెంట్ మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజు ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేసారు. సైకో చేతిలో రాష్ట్ర రాజధాని పేరిట వివిధ సందర్భాల్లో అమరావతిపై జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాల వీడియోను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు.
ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా...ఒక సైకో వల్ల రాష్ట్రం నాశనం కావటానికి వీల్లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తేల్చిచెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలిందన్నారు. అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితం అంటే జగన్ రెడ్డికి అంత చులకనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి కుక్క అని ముద్రవేసే రీతిలో అమరావతిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. పైరవీల కోసం ఎంత నీచానికి దిగజారాలో అంత నీచంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే పన్నుల రూపేణా రాష్ట్రమంతటికీ ఆదాయం వచ్చి ఉండేదని పేర్కొన్నారు. ప్రజా వేదికతో ప్రారంభమైన అమరావతి విధ్వంసం ఇప్పుడు రోడ్లు తవ్వేసేదాకా వచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాలను సైతం వదలకుండా విధ్వంసం సాగిస్తున్నారని మండిపడ్డారు.
గంజాయి రాజధానిగా మార్చారు..జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టడంలో దిట్ట, దోచుకోవటంలో అనకొండ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పెట్టుబడులన్నీ తరిమేసి ఏం ఒరగపెట్టడానికి విశాఖ వెళ్తున్నానని జగన్ రెడ్డి చెప్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 45వేల కోట్ల భూములు కాజేసి గంజాయి రాజధానిగా విశాఖను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని నిర్వీర్యం చేసి గోదావరిలో ముంచేశారని దుయ్యబట్టారు. రుషికొండకు కూడా బోడిగుండు కొట్టించిన ఘనుడు జగన్ అని విమర్శించారు.