sarojanamma social service in nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్‌కి చెందిన దంపతులు వెంకట్రావు, సరోజనమ్మ. వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగిగా పనిచేయగా సరోజనమ్మ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించేవారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకున్నా సంతానం లేరనే లోటు ఉండేది. దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. సరోజనమ్మ పాతికేళ్ల కింద రిటైర్ అయ్యారు. వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొన్నారు.
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భర్త మరణించారు. అంతవరకూ తోబుట్టువుల పిల్లలే తనపిల్లలు అనుకొని కాలం గడిపారు. ఆస్తిచూసి ప్రేమ చూపిస్తున్నారని తెలిసి బాధపడిన సరోజనమ్మ.. అవన్నీ చూసి విసిగిపోయింది.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంది. ఆ సమయంలో విశ్రాంత ఉపాధ్యాయులు పడుతున్న బాధలు ఆమెను కదిలించాయి.
విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి సొంత భవనం లేదని తెలిసి తన తర్వాత ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కింద రిజిస్ట్రేషన్ చేశారు. ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్లు ఉంటుంది. విషయం తెలుసుకున్న బంధువులు సరోజనమ్మ ఇంటి వైపు రావడం మానేశారు.
ఓసారి దగ్గరి బంధువు చనిపోతే అంతక్రియలకు వెళ్లినప్పుడు ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. విషయం ఆరాతీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థుల్లో ఒకరు చనిపోతే వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఆ బాధలు తప్పట్లేదని సరోజనమ్మకు అర్ధమైంది.