మరో 58 టీఎంసీల చేరితే నాగార్జునసాగర్ జలాశయంలో నీరు పూర్తిస్థాయికి చేరుతుందని అధికారులు తెలిపారు. కృష్ణ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి ఆదివారం రాత్రికి దాదాపు లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వరద పెరిగితే ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం గేట్లు తెరిచి దిగువకు వదిలే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
నాగార్జునసాగర్ జలాశయం ఇన్‌ఫ్లో 4,54,931 క్యూసెక్కులుండగా.. ఔట్‌ఫ్లో 35,820 క్యూసెక్కులు ఉంది. జలాశయ గరిష్ఠస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 567.20 అడుగల మేర నీరు చేరింది. సాగర్ గరిష్ఠ స్థాయి నీటినిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 254.31 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
సాగర్ జల విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అనంతరం 34,138 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలానికి జూరాల నుంచి కృష్ణా నది ద్వారా 4.54 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది ద్వారా సుంకేశుల నుంచి 39,170 క్యూసెక్కుల వరద వస్తోంది.
ఈ ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి (ఏపీ) ఉత్పత్తి అనంతరం 27,336 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి (తెలంగాణ) 29,200 క్యూసెక్కులు, స్పిల్‌వే ద్వారా (పది గేట్లు ఎత్తి) మొత్తం 5.26 లక్షల క్యూసెక్కులు నదిలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహకంలోని ప్రాజెక్టులకు స్వల్పంగా ప్రవాహం వస్తోంది.